Tuesday, November 26, 2024

రెవెన్యూ శాఖలో పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌.. వివరాలు కోరిన సర్కారు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిప్యుటీ కలెక్టర్ల ప్రమోషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యుటీ కలెక్టర్లకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్లుగా పదోన్నతులను వర్తింపజేసేందుకు రోస్టర్‌ పాయింట్లు, రిర్వేషన్‌, సీనియార్టీఅ జాబితాలను కోరుతూ సీసీఎల్‌ఏకు ప్రభుత్వం నోట్‌ను పంపింది. ఈ నెల 6లోగా పూర్తి వివరాలను పంపించాలని కోరింది. ఆ తర్వాత వెంటనే పదోన్నతులకు శ్రీకారం చుట్టనుంది. దీంతోపాటు 31 జిల్లాల్లో జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టుల భర్తీతోపాటు నాలుగు జిల్లాల్లో ఖాళీగా ఉన్న అదనపు కలెక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది.

ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన సేవల అందజేతలో కీలకమైన రెవెన్యూ శాఖ అనేక సమస్యలతో అతలాకుతలమవుతోంది. కీలక శాఖలో పోస్టుల్లో ఖాళీలతోపాటు శాఖాధిపతి లేక సమస్యలు తీవ్రమవుతున్నాయి. పెరిగిన పనిభారానికి తోడు పోస్టుల సంఖ్య పెరగకపోవడం, సీసీఎల్‌ఏ పోస్టు లేకపోవడంతో పాలనాపరంగా కుంగిపోతోంది. పలు మండలాల్లో తహశీల్దార్లు లేకపోగా 33 జిల్లాల్లో అంతంతమాత్రంగా ఉన్న కేడర్‌ స్ట్రెంగ్త్‌ ఈ శాఖ పనితీరుపై పెను ప్రభావమే చూపుతోంది. మరో 252 మంది డిప్యుటీ తహశీల్దార్ల కొరత కూడా సవాలుగా మారింది. కొత్త జిల్లాల్లో ఆర్డీవో(రెవెన్యూ డివిజనల్‌ అధికారి)ల పోస్టులకు కొరత తీవ్రతరమవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో రెవెన్యూ పోస్టులకు పనిభారం కూడా అంతే భారీగా పెరిగింది. తాత్కాలిక కేటాయింపులు, సర్దుబాట్లలో భాగంగా ఆర్డీవోలను, డీఆర్వో(జిల్లా రెవెన్యూ అధికారి)లను అదనపు కలెక్టర్లుగా నియమించారు. దీంతో రాష్ట్రంలో అనేక రెవెన్యూ డివిజన్లకు ఖాళీలు ఏర్పడ్డాయి. తద్వారా రెవెన్యూ డివిజన్లలో అనేక సమస్యలు పెరుగుతున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులు కూడా ఖాళీగా ఉండటంతో భూ సమస్యల పరిష్కారంలో జాప్యం పెరిగిందనే ఆరోపణలు పెరిగాయి.

సీనియార్టీ అంశం తెరపైకి…

మరోవైపు డిప్యుటీ కలెక్టర్ల సీనియార్టీ విషయంలో అనేక వివాదాలు ప్రభుత్వానికి చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. డిప్యుటీ కలెక్టర్లను స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలన్న వివాదం కోర్టుకు వెళ్లడంతో జాప్యం నెలకొంది. దీంతో అప్పట్లో ఆర్డీవోల నియామకంపై ప్రభావం పడింది. కాగా ఈ అంశంలో న్యాయవివాదం తీరడంతో పదోన్నతులకు ప్రభుత్వం రెడీ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌, రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, నూతన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల వంటి కీలకమైన అంశాలతో ఈ శాఖ పనితీరు మరింత భారంగా పరిణమించింది.

- Advertisement -

ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలతో ముందుకెళుతున్న ఇంతటి కీలక శాఖకు కీలకమైన భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌ పోస్టు ఇంచార్జే దిక్కుగా ఉన్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా పూర్తిస్థాయి బాస్‌ లేని పరిస్థితిలో ఈ శాఖ బిక్కుబిక్కుమంటోంది. గతంలో ఎస్‌కె సిన్హా, రేమండ్‌ పీటర్‌, సీసీఎల్‌ఏలుగా పూర్తిస్థాయిలో కొనసాగగా. రాజీవ్‌శర్మ, ఎస్పీ సింగ్‌, ప్రదీప్‌ చంద్రలు ఇంచార్జీలుగా బాధ్యతలను నెరవేర్చారు. ఆ తర్వాత ఈ శాఖకు రెగ్యులర్‌ సీసీఎల్‌ఏ నియామకం జరగలేదు.

పర్యవేక్షణ లోపం…

భూ రికార్డుల అంశంతోపాటు, ధరణి పోర్టల్‌ అంతా సీసీఎల్‌ఏ కనుసన్నల్లోనే జరగాలి. కానీ ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో తప్పొప్పుల సవరణపై పర్యవేక్షణ కొరవడింది. రెవెన్యూ కోర్టుల రద్దు తర్వాత సివిల్‌ కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయి. సిబ్బందికి శిక్షణ, జమాబందీ సుధీర్ఘ కాలంగా జరగడంలేదు. తాజాగా రిజిస్ట్రేషన్‌ సేవలను కూడా తహశీల్దార్లకు కట్టబెట్టడంతో పనిభారం మరింత పెరిగింది. పనిఒత్తిడిలో తహశీల్దార్లు రిజిస్ట్రేషన్‌ సేవలపై దృష్టిపెట్టలేకపోతున్నారు. రైతుబంధు పథకం, పాస్‌ పుస్తకాల పంపిణీ, ధరణి ప్రాజెక్టు పరిశీలనలో నిమగ్నం కావడంతో అదనపు బాధ్యతలకు సమయం చిక్కడంలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement