Sunday, November 10, 2024

భువనగిరి కోట శిలాగర్భంలో రహస్య గదులు? కోట ముఖ ద్వారం సమీపంలో సొరంగం

  • కోటపై ఉన్న జలాశయం నుంచి రహస్య గదుల్లోకి నీటి సరఫరా
  • స్వదేశీ దర్శన్‌ స్కీం కింద భువనగిరి అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌
  • రూ.120.51 కోట్ల నిధులతో కాన్సెఫ్ట్‌ నివేదిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శత్రు దుర్భేద్యమైన భువనగిరి కోట రాతి గర్భంలో చెక్కుచెదరని రహస్యాల దొంతరలను ఛేదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కేంద్రపురాస్తు శాఖ ఆధీనంలోని ఈ కోట దేశంలోని గిరిదుర్గాల్లో అత్యంత రహస్యస్థావరంగా చరిత్రలో మిగిలింది. పైకి అగుపించే కోట ఆనవాళ్లు, అంతపుర శయన మందిరాలు, గుర్రపుశాలలు, స్నానవాటికలే ఈ కోట అందాలకు చిరునామా కాదు. కోట పైనున్న జలాశయం, సైనిక శిక్షణ శిబిరాలు, ధాన్యాగారాలు, గుర్రపుశాల చరిత్ర మాత్రమే భునవగిరి దుర్గం సంపూర్ణ చరిత్ర అనే పొర పాట్ల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. భువనగిరికోటలో చరిత్రకు అందని రహస్యాల దొంతరలు అనేకం ఉన్నాయి.

అయితే కోట పై అనేక మంది చరిత్రకారులు చేసిన పరిశోధనల ఫలితాలను ఆధారంగా చేసుకుని కేంద్ర పురావస్తు శాఖ కోటను పునరుద్ధరించి దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు నిధులు సమకూర్చింది. రాష్ట్ర పురావస్తుశాఖ, పర్యాటక శాఖ, క్రీడాశాఖల సమన్వయంతో కోటఅందాలను చరిత్రను ద్విగుణీకృతం చేసేందుకు కేంద్రం స్వదేశీ దర్శన్‌ స్కీం కింద తెలంగాణ రాష్ట్రంలోని ఫోర్ట్‌ సర్కూట్‌ అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది.

భూగోళంలో కిలోమీటర్ల లోతులో కోట్ల సంవత్సరాలక్రితం విస్తరించిన బాతోలిథ్స్‌ ఏకశిల పై విస్తరించిన గిరిదుర్గం భువనగిరికోట. దేశంలోని కోటలన్నింటికంటే చెక్కుచెదరని ఏకశిలా పునాదిపై ఏకశిలగా విస్తరించిన ఈ కోట పై భాగానికంటే లోపలి భాగం కఠినశిలలతో విస్తరించి ఉంది. భూమిలో విస్తరించిన శిలలను తొలిచి అనేక అంతస్తుల్లో రహస్య నిర్మాణాలు చేసినట్లు తెలుస్తుంది. భూగోళం లోపల, బయట విస్తరించిన ఈ కోట చరిత్ర ఇప్పటికీె బహిర్గతమైంది పైన కనిపించే చరిత్రమాత్రమే. మూడువేల సంవత్సరాల చరిత్రకు శిథిల సాక్ష్యంగా నిలిచిన ఈ కోటను కేంద్రం గా చేసుకుని అనేక రాజవంశాలు పాలించాయి. తెలుగు రాష్ట్రాలను ఏలిన రాజులందరూ ఈకోటనుంచి పాలించినట్లు పుష్కలంగా చరిత్ర ఆధారాలు లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చరిత్ర మేరకు మగధను పాలించిన మహాపద్మానందుడు అశ్మక గణతంత్ర రాజ్యాన్ని ఆక్రమించి నేటి తెలంగాణ ప్రాంతంలో రాజ్యవిస్తరణ చేసినట్లు హాతిగుంఫ శాసనం లో ఉంది.

నాటినుంచి పాలించిన మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ చాళుక్యులు, కందూరు చోడులు, కాకతీయులు, పద్మనాయకులు, బహమనీసుల్తానులు, సర్వాయి పాపన్న గౌడ్‌, కుతుబ్షాహీలు, మొగలులు, నిజాంల ఏలుబడిలో దశలవారిగా కోట విస్తరణ జరిగింది. శత్రు దుర్భేద్య కేంద్రంగా, సైనిక శిక్షణ శిబిరంగా విరాజిల్లింది. అయితే ప్రస్తుతం మనకు అగుపించేంది బాహ్య చరిత్ర, శాసనాధారాలు మాత్రమే కానీ భూగర్భ శిలాగృహాల చరిత్ర పరిశోధన మిగిలి ఉంది.

భువనగిరి కోట పైనున్న జలాశయంలో అన్ని కాలాలకు సరిపడే నీటి నిల్వఉంది. ఈ జలాశయం నుంచి కోట కింది భాగానికి పైపు లైన్లు ఉన్నట్లు తెలిసింది. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకుంటే భవనగిరి కోట అంతరాల్లో రహస్య గదులు,బహుళ అంతస్తుల భవనాలు ఉండటంతోనే నీటి సరఫరా జరుగుతున్నట్లు ఇంజనీర్లు అంచనా వేశారు. ఇలాంటి రహస్య నీటి పారుదల వ్యవస్థ దుర్గం చెరువు నుంచి గోల్కొండ కోటకు ఉండేది. పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్ల విక్రమాదిద్య ఈ కోటను నిర్మించి అనేక దానాలు,అభివృద్ధి చేసినట్లు చెక్కు చెదరని శాసనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్రీ.శ. 1111లో భువనగిరి దండనాయకుడు లక్ష్మీ దేవుడికి ‘ నందా దివిగే’ దానం చేసినట్లు ఉన్న శాసనంతో ఈ కోటను త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు లభ్య మవుతున్నాయి.

- Advertisement -

నిజాం ఏలుబడిలో గోల్కొండ కోటలోని బాలాహిస్సార్‌ మాదిరిగా కోట ముఖ ద్వారాన్ని నిర్మించారు. కోట ముఖద్వారం నుంచి కొంత మేరకు ముందుకు వెళ్లగానే ఒక రహస్య సొరంగ మార్గం అగుపిస్తుంది. ఆ సొరంగ మార్గం దగ్గరకు వెళ్లితే వింత శబ్దాలు వినిపిస్తాయి. కోట అంతర్భాగంలో నిర్మించిన గృహాల్లో విష నాగులు, కొండ చిలువలు ఉన్నట్లు స్థానికంగా ప్రచారంలో ఉండటంతో లోనికి వెళ్లే సహసం ఎవరూ చేయరు. అలాగే కోట పైన గాలి వెల్లేందుకు ఉన్న అతిపెద్ద రంధ్రంపై పెద్ద శిల కప్పబడి ఉంది. బహుష ఇక్కడి నుంచికోటలోనికి ఆక్సిజన్‌ వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

వరంగల్‌ కోటను జయించి భువనగిరిని రాజధానిగా చేసుకుని గోల్కొండ కోట పై విజయం సాధించిన సర్వాయి పాపన్న గౌడ్‌ గోల్కొండ నుంచి, వరంగల్‌ నుంచి అపారమైన నిధులు సమీకరించి భువనగిరి అంతర్భాగంలో ఉన్న కాళీకా ఆలయంలో భద్రపరిచినట్లు స్థానికిలు చెప్పుతారు.అయితే ఇప్పటివరకు సర్వాయి పాపన్న కు సంబంధించిన నిధుల ఆధారాలు పురావస్తు శాఖకు లభ్యం కాకపోవడానికి ఇదే కారణమై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. తెలంగాణ లోని ఫోర్ట్‌ సర్క్యూట్‌ అభివృద్ధిలో భువనగిరికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వదేశీ దర్శన్‌ స్కీం రూ. 120. 51 కోట్లు కేటాయించడంతో భువనగిరి పర్యాటక కేంద్రంగానే కాకుండా చరిత్ర పరిశోధనకు అవకాశాలు సుగమనం అవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement