Saturday, November 23, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్…

చెట్లు మనుషుల ఆత్మలకు శాంతినిస్తాయి (Trees give peace to the souls of men) అని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ లోని పంచవతి కాలనీలో ఆండ్రూ ఫ్లెమింగ్ మొక్కలు నాటారు. అనంత‌రం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంపై, తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ఐకాన్, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కోవిడ్ వారియర్స్ తో పాటు ఆండ్రూ ఫ్లెమింగ్ మొక్కలు నాటారు. ఇంగ్లీషు సాహిత్యంలో చెట్లు వాటి వేర్లు మానవ ఎదుగుదలను, మనిషి తన మూలాలను మరిచిపోవద్దనే మూల సూత్రాన్ని వివరిస్తుంటాయ‌న్నారు. అందుకే మనిషి తన ఎదుగుదలను మొక్కలతో పోల్చుకోవాలని పిలుపునిచ్చారు.

నేను ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పటి వాతావరణానికి ఇప్పటి హైదరాబాద్ కు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసిన పచ్చదనం పరుచుకుంద‌న్నారు. అంతేకాదు, కాలాలకు అతీతంగా.. నిత్యం మొక్కలు నాటించే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం అద్భుతంగా ఉంద‌న్నారు. మనిషి తలచుకుంటే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిరూపించార‌న్నారు. వారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాకుడదు.. మానవ నాగరికత నడుస్తున్న ప్రతీ చోట ఇది అవసరమేనని ఆయన తెలిపారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకొని దిగ్వజయంగా కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రూ ఫ్లెమింగ్ కు కృతజ్ఞతలు.. తెలంగాణ అభివృద్ధి గురించి వారి చెప్పిన మాటలు చాలా విలువైనవి అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ కొవిడ్ వారియర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పోరేటర్ మన్నె కవితా రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కోఆర్డినేటర్ రాఘవతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement