టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు స్వదేశానికి తిరిగిరాగానే హర్షధ్వానాలు మిన్నంటాయి. టీమిండియా కలను నిజం చేసిన హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా హీరోగా మారాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అవమానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు తనను ట్రోల్ చేసిన అభిమానులందరి మనుసు గెలుచుకుని వారితోనే జేజేలు కొట్టించుకుంటున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు నిదర్శనం.
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన రోజు నుంచి టోర్నీ ముగిసే దాకా అతడు హేళనకు గురయ్యాడు. సొంత మైదానమైన వాంఖడేలోనే అభిమానులు అతడిని ట్రోలింగ్ చేశారు. ఆ ప్రభావం ఆటపై కూడా పడడంతో పాండ్యా మెప్పించలేకపోయాడు. కానీ, టీమిండియా జెర్సీ వేసుకోగానే పాండ్యా ఆటే మారిపోయింది. ఆఖరి ఓవర్ వేసి రోహిత్ సేనను 7 పరుగుల తేడాతో గెలిపించిన పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. భావోద్వేగంతో అతడు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కోట్లాదిమంది భారతీయులను కదిలించాయి.