ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: కొంత కాలంగా సిటీ బస్సుల కొరతతో సతమతమవుతున్న గ్రేటర్ ఆర్టీసీ కొత్త బస్సులను సమకూర్చుకునేందుకు సమాయత్తమౌతోంది. అయితే సాధారణ బస్సులను కాకుండా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకు రావడానికి నిర్ణయించింది. 2023-24 ఏడాది కల్లా విడతల వారీగా 2 వేల వరకు బస్సులను సమకూర్చుకునేందుకు నిర్ణయించింది. ఇందులో బాగంగా మొదటి విడతలో 360 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకు వచ్చేందుకు ఇప్పటికే టెంటర్లను పిలిచింది. ఇందులో 300 నాన్ ఏసీ, 10 డబుల్ డెక్కర్‌తో పాటు 50 ఏసీ బస్సులు ఉన్నాయి. 2023 మార్చి వరకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. కుదు పులు లేక పోవడం, శబ్దం రాకపోవడంతో వీటిలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారని ఆర్టీసీ భావిస్తోంది. వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నందున నిర్వహణ, డ్రైవర్ ఖర్చుల భారం కూడా ఆర్టీసీ పడే అవకాశం లేదు. భవిష్యత్‌లో హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
అదనపు సదుపాయాలు..
సాధారణ బస్సులతో పోల్చితే ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికులకు సదుపాయాలు అదనంగా ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పాయింట్లతో పాటు సీనియర్ సిటిజన్లకు సులభంగా ఎక్కేందుకు మెట్లు ఉంటాయి. బస్సులో కూర్చుంటే సాధారణ బస్సులా కుదుపులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. నగంరం రోడ్లకు ఇలాంటి బస్సులే నయమనే భావనతో విద్యుత్ బస్సుల వైపు మొగ్గు చూపింది. విద్యుత్ బస్సులకు సగటున 50 నుంచి 60 శాతం ఆక్యూపెన్సి ఉంటుందని తెలుస్తోంది. డిజిల్ ధరలు భారీగా పెరగడంతో పాటు బల్క్ డిజిల్ రేట్లను పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. డిజిల్ ఖర్చులు తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలంటే ఎలక్ట్రిక్ బస్సులు పెంచుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు.
ఇంటర్ స్టేట్ రూట్లలో ఏసీ బస్సులు..
గ్రేటర్ ఆర్టీసీ సకూర్చుకునే 50 విద్యుత్ బస్సులను ఇంటర్ స్టేట్ రూట్లలో తిప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. కుదుపులు లేక పోవడం, శబ్దం రాకపోవడంతో వీటిలో రాత్రి పూట ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారని ఆర్టీసీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో వీటిని అనుసంధానించనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూర్‌తో పాటు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాలకు వీటి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటి ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో మరిన్ని ఇంటర్ స్టేట్ సేవలు తీసుకురానున్నారు.