గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం..స్టార్ ప్లేయర్ పీలే కన్నుమూశారు.ఆయన వయసు 82సంవత్సరాలు. ఆయన.. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పీలే మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. సాకర్ లెజెండ్ కన్నుమూయడంతో క్రీడాకారులు, ప్రముఖులు, క్రీడాభిమానులు సంతాపం ప్రకటించారు. కేన్సర్ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్‌లో వైద్యులు కణితిని తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ అందిస్తుండగా.. ఇటీవల పీలే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. పీలే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది.
పీలే 1940 అక్టోబర్ 24న జన్మించారు. సాకర్‌లో గొప్ప ఆటగాడి పేరు తెచ్చుకున్నారు.. 16 ఏళ్ల వయసులో బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ మ్యాచుల్లోకి అరంగేట్రం చేశాడు. 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డ్ ఉంది. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో పీలేది కీలకపాత్ర. మూడు ప్రపంచకప్‌లు అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచాడు.. ది బెస్ట్ ఫుట్‌బాల్ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా పేరు సంపాదించుకున్నారు. పీలే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా.. చివరిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. తాను నెలవారి చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చానని.. తనకు అందరి నుంచి పాజిటివ్ మెసేజ్‌లు వస్తున్నాయని.. ఇది చాలా ఆనందంగా ఉంద్నారు. తన కోసం మెసేజ్‌లు పంపిస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంతలోనే పీలే కన్నుమూశారు.