ఐ యామ్ ఎ డిస్కో డ్యాన్సర్ అంటూ ఉర్రూతలూగించిన నటుడు
హిందీలోనే కాకుండా పలు భాషా చిత్రాలలో నటించిన హీరో
ఒకే ఏడాది 19 మూవీలలో నటించిన ఏకైక నటుడు
ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారం
భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తిని వరించింది. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా అధికారికంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్టోబర్ 8న జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్‌లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. మిథున్ చక్రవర్తి ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా తాజాగా కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి విషయానికి వస్తే. 1950లో ఆయన కోల్‌కతాలో జన్మించారు. 1976లో ఆయన నటుడిగా ‘మృగాయ’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. తొలి చిత్రంతోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో ఆయన నటించి స్టార్ యాక్టర్‌గా మారారు. ‘బన్సారీ’, ‘అమర్‌దీప్’, ‘సాహాస్’, ‘వాంటెడ్’, ‘బాక్సర్’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్’, ‘దలాల్’, ‘భీష్మ’, ‘సుల్తాన్’, ‘గురు’, ‘కిక్’, ‘బాస్’, డిస్కోడాన్సర్ వంటి ఎన్నో చిత్రాలు ఆయనని స్టార్ నటుడిని చేశాయి.
హిందీతో పాటు బెంగాలీ, కన్నడ, ఒరియా, భోజ్‌పురి, తెలుగు చిత్రాల్లోనూ ఆయన నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమాలో స్వామిజీగా ‘థ్యాంక్యూ’ అంటూ తన విలక్షణ నటనతో తెలుగు వారికి సుపరిచితమయ్యారు. ఆ తర్వాత ‘మలుపు’ అనే చిత్రంలోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మిథున్ పేరు వినగానే గుర్తొచ్చే పాట ‘ఐ యామే డిస్కో డాన్సర్’. ఈ పాటతో దేశవిదేశాలలో ఆయన గుర్తింపును తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో ఒకే ఏడాది 19 చిత్రాల్లో నటించి అరుదైన ఘనత సాధించిన ఏకైక హీరో మిథున్.. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం అందజేసింది.