న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని జాంగ్‌పుర ప్రాంతంలో ఉన్న ఉమ్రావో జ్వలరీ షాపులో గత ఆదివారం సుమారు 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ఇద్దర్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. చత్తీస్‌ఘడ్‌లోని దుర్గలో ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. ఆ ఇద్దరి వద్ద నుంచి సుమారు 12.50 లక్షల నగదు, 18 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జ్వలరీ షాపులో చోరీ చేసిన కేసులో బంగారాన్ని, నగదును సీజ్ చేసినట్లు బిలాస్‌పూర్ ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు.
చోరీ చేయడానికి ముందు దొంగలు ఆ బిల్డింగ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేశారు. లాకర్లు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌కు రంధ్రం చేసి మరీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. నాలుగు అంతస్తులు ఉన్న ఆ బిల్డింగ్‌లోకి పై అంతస్తు నుంచి దొంగలు ప్రవేశించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను పగలగొట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించేందుకు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. అక్కడ ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్‌లో డిస్‌ప్లేలో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు.
ఈ కేసులో మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితుల్లో లోకేశ్ శ్రీవాత్సవ్, శివ చంద్రవంశీతో పాటు మరో పేరు తెలియని వ్యక్తి ఉన్నాడు. ఆ ముగ్గురి నుంచి భారీ స్థాయిలో బంగారాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌తో పాటు ఏపీలోనూ ఆ దొంగలు ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు..