Tuesday, November 19, 2024

ఢిల్లీలో ఘనంగా ఉగాది వేడుకలు.. ఆంధ్రప్రదేశ్ భవన్ వెబ్‌సైట్ ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో బుధ, గురువారాల్లో ఈ వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో భవన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెర్ప్, ఏపీ మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్, ఆప్కో, డ్వాక్రా, గిరిజన కో ఆపరేటివ్, లేపాక్షి, చేనేత స్టాళ్లను మొదటి రోజు వైఎస్సార్సీపీ ఎంపీలు తలారి రంగయ్య, రెడ్డప్పతో పాటు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, స్పెషల్ కమిషనర్ రమణారెడ్డి, రెసిడెంట్ కమిషనర్ సౌరభ్ గౌర్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ప్రారంభించారు.

ఆయా దుకాణాల్లో దొరికే ఉత్పత్తులను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, మహిళలు, పురుషుల కోసం వేర్వేరు విభాగాల్లో సంప్రదాయ వస్త్ర ప్రదర్శన, సుమతి, భగవద్గీత శతకాలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుల నాదస్వరంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు చిలకమర్తి ప్రభాకర శర్మ పంచాంగ శ్రవణం గావించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథ ఆహుతులను ఆకట్టుకున్నాయి.

అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ భవన్ వెబ్‌సైట్

రెండోరోజు సాయంత్రం కమిషనర్లు ఆంధ్రప్రదేశ్ భవన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఢిల్లీ, ఎన్సీఆర్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు ఈ వెబ్‌సైట్ ద్వారా భవన్ వివరాలను తెలుసుకోవచ్చు. www.andhrabhavan.ap.gov.in ద్వారా భవన్‌లో వసతి, ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాల్ బుకింగ్ చేసుకునే అవకాశముంటుంది. భవన్ లోని వివిధ కార్యాలయాలు, ఏపీఐసీ, టూరిజం సెంటర్, లీగల్ సెల్, పే అండ్ అకౌంట్స్, రిసెప్షన్, ఆర్సీ ఆఫీసు, క్యాంటీన్ వివరాలు వంటివి ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

అంబేద్కర్ ఆడిటోరియంలో వారాంతంలో ప్రదర్శించే సినిమాల వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. సాయంత్రం నిర్వహించిన మ్యాజిక్ షో, నాట్య ప్రదర్శనలు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలను అలరించాయి. మహిళల కోసం ఉచిత మెహందీ ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఉగాది వేడుకల్లో ఉదయం 11.00, మధ్యాహ్నం 3.00లకు చలనచిత్రాలు ప్రదర్శిస్తారు. నాలుగు రోజుల పాటు చేనేత వస్త్ర ప్రదర్శన ఉండనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement