Monday, November 25, 2024

Delhi | ఏపీ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరేసిన ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభపూర్తి సామర్థ్యంతో పనిచేసి దేశాన్ని సరికొత్త ఎత్తులకు చేర్చుదామంటూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జెండా వందనం అనంతరం మాట్లాడారు. భవన్ ఉద్యోగులు, సిబ్బందిని రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సిందిగా సూచించారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు సిద్ధించాలని గుర్తుచేశారు. ఈ వేడుకల్లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. వేడుకల కోసం ఏపీ భవన్‌ను రంగు రంగుల విద్యుద్దీపాలు, అలంకరణతో ముస్తాబు చేశారు.

ఎర్రకోటకు తెలుగు జంటలు

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నివసించే వివిధ రాష్ట్రాలకు చెందినవారిని ఎర్రకోటకు ఆహ్వానించింది. వచ్చేవారు తమ రాష్ట్రాల సాంప్రదాయ వేషధారణ, కట్టుబొట్టులో రావాల్సిందిగా సూచించింది. ఆ క్రమంలో ఆయా రాష్ట్రాల భవన్‌లకు సమాచారం అందించి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరడంతో ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు 10 రోజుల క్రితం నుంచే ఆహ్వానితుల జాబితా తయారు చేసి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం గం. 6.00కు ఏపీ భవన్ నుంచి రెండు బస్సుల్లో తెలుగు జంటలను సాంప్రదాయ దుస్తుల్లో ఎర్రకోటకు తీసుకెళ్లారు. అల్పాహారంతో పాటు తాగునీటిని అందజేశారు. ఎర్రకోట వద్ద ప్రత్యేకంగా కేటాయించిన ఎన్‌క్లోజర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం పూర్తయిన తర్వాత అందరినీ మళ్లీ ఏపీ భవన్‌కు తీసుకొచ్చారు. అనంతరం అక్కడ జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందరికీ భాగస్వామ్యం కల్పించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement