Tuesday, November 26, 2024

Big story : నెమ్మదిగా సీఎంఆర్‌ ప్రక్రియ.. మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ధాన్యం సీఎంఆర్‌ ప్రక్రియ నెమ్మదిగా , నత్తనడక న సాగుతుండడంతో ఈ ఖరీఫ్‌ ధాన్యం నిల్వపై ఆందోళననెలకొంది. ఇప్పటికీ మిల్లర్లు గత ఏడాది 2021-22 ఏడాది ఖరీఫ్‌ దాన్యాన్నే పూర్తిస్థాయిలో మర ఆడించలేదు. గతేడాదికి సంబంధించిన ఖరీఫ్‌ ధాన్యంలో ఇప్పుడిప్పుడే సగం మేర మాత్రమే సీఎంఆర్‌ ప్రక్రియ పూర్తికావాస్తోంది. గత ఖరీఫ్‌లో 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు చేరింది. గత యాసంగిలో మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు ఇంకా మర ఆడించే ప్రక్రియను మొదలుపెట్టనేలేదు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల నిల్వకు ఇబ్బందులు తప్పేలా లేదు.

మరో వారం రోజుల్లో ప్రస్తుత ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7వేల కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 100లక్షల టన్నుల పైగా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.అయితే ఇప్పటికే గత ఖరీఫ్‌తోపాటు యాసంగి ధాన్యం నిల్వలు మిల్లుల్లో పేరుకుపోవడంతో ఈ ఖరీఫ్‌లో వచ్చే ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని మిల్లుల్లో మాత్రమే ఖాళీ స్థలాలు ఉండగా…70శాతం మిల్లుల్లో ధాన్యం నిల్వకు స్థలం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా మిల్లులు ఉన్నాయి. దీంతో ధాన్యం నిల్వ ఎక్కడ చేయాలో తెలియక సివిల్‌సప్లైశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

- Advertisement -

రాష్ట్రంలో నవంబరు మధ్య నుండి డిసెంబరు మూడో వారం మధ్యన ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. రాస్ట్ర వ్యాప్తంగా దాదాపు 7వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 1750 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సాధారణరకం ధాన్యానికి రూ.2040, మేలురకం ధాన్యానికి రూ.2060ని ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఎఫ్‌లో ధాన్యం దిగుబడి పెరగనుండడంతో ఆ మేరకు సీఎంఆర్‌ ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల సామర్థ్యాన్ని కూడా పెంచింది. గతంలో 14లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతోనే రైస్‌ మిల్లులు ఉండగా… ఇప్పుడు 2300 మిల్లుల్లో నిరంతరాయంగా సీఎంఆర్‌ ప్రక్రియ కొనసాగేందుకు ఏర్‌పట్లు చేశారు. ఈ ఏడాది కేంద్రం ప్రభుత్వం వద్ద ఆహార నిల్వలు తగ్గుముఖం పట్టడంతో ఖరీఫ్‌ ధాన్యాన్నంతటినీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.

కాగా.. గత యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొర్రీలతోనే సీఎంఆర్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొందని తెలంగాణ మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. గత యాసంగి ధాన్యం కొనేది లేదని కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే నష్టాన్ని భరించి మరీ కొనుగోలు చేసింది. అయితే సీఎంఆర్‌ తర్వాత నూకశాతాన్ని తేల్చకపోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని మిల్లర్లు చెబుతున్నారు. మిల్లుల్లో ఖాళీ స్థలం లేకపోతే ప్రభుత్వ, ప్రయివేటు గోదాముల్లో ధాన్యం నిల్వ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గోదాముల్లోనూ ఎంత మేర ధాన్యం నిల్వ కు స్థలం ఖాళీగా ఉందో తెలియాల్సి ఉంది. అవసరమైతే ప్రయివేటు గోదాముల్లోనూ ధాన్యం నిల్వకు పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement