ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి : అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నత్తనడకన సాగుతోంది…ఇప్పటి వరకు 30 శాతం మేర కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు…అకాల వర్షాల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది…చాలా ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. ముందుగా నాట్లు వేసిన రైతులు అప్పుడే కోతలకు శ్రీకారం చుట్టారు. కాస్త ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు మాత్రం వరికోతలకు ఇంకా టైముంది…జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇందులో కేవలం తొమ్మిది మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతావి వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అప్పటివరకు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపించడం లేదు…ఈసారి 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు…ఇందులో ఎంతమేర కొనుగోలు చేస్తారనేది వేచి చూడాలి.
అకాల వర్షాల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వందలాది ఎకరాల పంట నీళ్లపాలైంది.ఉన్నకాస్త పంటను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలుపడుతున్నారు. జిల్లాలో నీటి వసతి పుష్కలంగా ఉన్న రైతులు ముందుగానే వరినాట్లు వేశారు. జిల్లా పరిధిలోని కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో ముందే వరినాట్లు వేశారు. ఈ ప్రాంతాల్లో వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ అనుకున్న మేర మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటివరకు కేవలం తొమ్మిదింటిని మాత్రమే ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరిపంట సాగు చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని రోజులు మాత్రమే కురిసే వడగండ్ల వర్షాలు ఈసారి మాత్రం వరుసబెట్టి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 12వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ప్రధానంగా వరిపంటే దెబ్బతింది. పొట్ట దశలో ఉన్నప్రాంతాల్లో వర్షాల నేపథ్యంలో పంట నేలపాలైంది. ఉన్న కాస్త పంటనైనా కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతుల ఆశలపై వర్షాలు నీళ్లు చల్లుతున్నాయి.
ఈసారి 50వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం..
యాసంగిలో రైతులనుండి 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 90 వేల ఎకరాల విస్తీర్ణంలో వరిపంట సాగు చేశారు. దీంతో దాదాపుగా 60వేల మెట్రిక్ టన్నుల మేర రైతులనుండి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కొంతమంది రైతులు నేరుగా మిల్లర్లకు అమ్ముకున్నా 50వేల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వరి సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆశించినమేర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికే ఆమన్‌గల్, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, ఫరూఖ్‌నగర్, చౌదరిగూడ, కొత్తూరు, కేశంపేట, కొందుర్గు ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు కోసిన తరువాత ధాన్యం ఆరబెట్టిన తరువాత కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు చేస్తారు. ఆరబెట్టే సమయంలోనే వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోతోంది. తడిసిపోయిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామి ఇచ్చిన విషయం తెలిసిందే. ఐనా రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఆలస్యమైతే కొనుగోలు చేయరనే అనుమానాలు రైతుల్లో నెలకొన్నాయి. వాటిని దూరం చేయాల్సిన గురుతర బాధ్యత సంబంధిత అధికారులపై ఎంతైనా ఉంది.
గతసారితో పోలిస్తే రెట్టింపుగా..
గతసారితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి గత యాసంగితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో వరి పంట సాగు చేశారు. గత ఏడాది యాసంగిలో జిల్లాలో 53వేల ఎకరాలు సాధారణ సాగు కాగా 47వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. ఈసారి అదే విస్తీర్ణంలో వరిపంట సాగవుతుందని వ్యవసాయ శాఖ భావించింది. కానీ ఈసారి ఏకంగా రెట్టింపు స్థాయిలో వరి సాగు చేశారు. ఈసారి యాసంగిలో ఏకంగా 90వేల ఎకరాల విస్తీర్ణంలో వరిపంట సాగయ్యింది. వాస్తవానికి యాసంగిలో వరి వేసేందుకు చాలామంది రైతులు వెనకాముందు అవుతారు. కానీ ఈసారి పోటాపోటీగా వరి సాగు చేశారు. బోరు బావుల్లో నీళ్లు ఉండటంతో నీటి వసతులు ఉన్న రైతులంతా వరి వైపే మొగ్గు చూపారు.అందుకే గతసారి కొనుగోలు చేసిన ధాన్యం కంటే ఈసారి రెట్టింపుగా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మరో వారం రోజుల తరువాతే పూర్తి స్థాయిలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆలస్యంగా వరినాట్లు వేశారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది. ఏదిఏమైనా ఈసారి వరి సాగు చేసిన రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది.