Friday, November 22, 2024

టోల్‌ప్లాజాల వద్ద బారికేడ్లకు స్వస్తి.. త్వరలో అమలులోకి కొత్త విధానం

త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థను అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రయాణికులు ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి వీకేసింగ్‌ తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థ స్థానంలో అడ్డంకుల్లేని టోల్‌ వ్యవస్థ లేదా ఓపెన్‌ టోల్‌ సిస్టమ్‌ అమలుకు సంబంధించిన ట్రయల్స్‌ కొనసాగుతున్నాయన్న ఆయన.. ఇది విజయవంతం కాగానే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు.

ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అలాగే, కి.మీల ఆధారంగా చెల్లింపులు చేయొచ్చని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థతో టోల్‌ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47సెకన్లకు తగ్గించగలిగామని.. ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్‌ వ్యవస్థను ప్రస్తుతం ఢిల్లి-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో పైలట్‌ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -

”మీరు జాతీయ రహదారిపైకి ప్రవేశించినప్పుడు టోల్‌ ప్లాజా వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ను కెమెరా స్కాన్‌ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. మీరు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాంతోపాటు అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి సాధ్యమవుతోంది. టెలి కమ్యూనికేషన్స్‌ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉంది” అని మంత్రి తెలిపారు.

మరోవైపు, ఈ ఏడాది మార్చిలో ఢిల్లిలో సీసీఐ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఇదే అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు వసూలుకు జీపీఎస్‌-ఆధారిత వ్యవస్థను ఆరు మాసాల్లో తీసుకొస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాలస్థానే వీటిని ఏర్పాటు చేస్తామన్న ఆయన వీటివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడంతో పాటు, ప్రయాణించిన దూరానికే ఫీజు వసూలు చేయడం వీలుపడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement