అమరావతి: ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం కలిశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం అని సీఎం పేర్కొన్నారు.
”అందుకే పెన్షన్సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపనపడ్డాం. గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపన పడ్డ సందర్భాలు లేవు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దష్టిలో ఉంచుకోవాలి. దీన్ని దష్టిలో ఉంచుకుని జీపీఎస్ను తీసుకువచ్చాం. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం” అని సీఎం జగన్ చెప్పారు.
”ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలి. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. రెండేళ్ల పాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసింది. దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశాం. సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నాం. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం. అలాగే వైద్యవిధాన పరిషత్‌ఉద్యోగులనుకూడా ప్రభుత్వంలో విలీనం చేశాం. వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం” అని సీఎం జగన్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వివరించారు.