Friday, November 22, 2024

HYD: కుల‌వృత్తులపై జీవనం సాగిస్తున్న వారికి అండ‌గా ప్ర‌భుత్వం … మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వారి అభివృద్దికి చేయూతను అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం సనత్ నగర్, జూబ్లిహిల్స్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాలకు చెందిన 1200 మంది బీసీ కులవృత్తి దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఒకొక్కరికి లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే లతో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారిగా ఈ ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అన్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. అత్యధిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాతనే హైదరాబాద్ నగరంలో బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. రోడ్ల అభివృద్ధి, పుట్ పాత్ ల నిర్మాణం, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, డ్రైనేజీ, వాటర్ సమస్యలను పరిష్కరించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే తెలంగాణా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంటే, ఇది చూడలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 55 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో 9 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తెచ్చారో ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రజలకు చెప్పగలరా ? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేశామో చెప్పేందుకు బోలెడు కార్యక్రమాలు ఉన్నాయన్నారు. ఏం చేశారని, ఏం మొఖం పెట్టుకొని ప్రజల వద్దకు ఓట్లు అడిగేందుకు వస్తారని నిలదీయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కండ్లముందే కనిపిస్తున్నాయని వివరించారు. పేద ప్రజల ఇబ్బందులు తెలిసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. పేదల కోసం నిర్మించిన ఇండ్లను ఎప్పుడు ఇవ్వాలో త‌మకు తెలియదా? త‌మకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలోని హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా, అంబర్ పేట లోని మూసీకి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే వరదలకు కాలనీలు, ఇండ్లు ముంపున‌కు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి అభివృద్ధి పనులు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు వివరించారు. ఇవే కాకుండా దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు, ముస్లీం మైనార్టీలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయాన్ని వివరించారు. అంతేకాకుండా పేద ప్రజలకు ఇండ్లు నిర్మించుకోవడం కోసం గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, బీసీ కార్పోరేషన్ అధికారి ఆశన్న, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement