Friday, November 22, 2024

TG | గోదావరి రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. జీవో జారీ

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను మరింత మెరుగుపరిచేందుకు గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గోదావరి రెండో దశ పనులకు ప్రభుత్వం రూ.5560 కోట్లు కేటాయించింది.

ఇదిలా ఉండగా ఈ పథకం ద్వారా నగరానికి అదనపు నీటిని తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు పునరుద్ధరణ కానున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు పూర్తి చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం అన్ని వనరుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల వరకు నీరు సరఫరా అవుతోంది.

అయితే 2030 నాటికి నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా 170 ఎంజీడీల నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నందున అదనపు నీటి కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2 చేపట్టాలని నిర్ణయించారు.

కాగా, గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-1 కింద ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని నగర ప్రజల నీటి అవసరాల కోసం వాటర్ బోర్డు మళ్లిస్తోంది. పథకం రెండో దశ ద్వారా మల్లన్న సాగర్ జలాశయం నుంచి మరో 15 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందులో 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు కాగా.. మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాల పునరుద్ధరణకు మిగిలిన 5 టీఎంసీలను వినియోగించనున్నారు.

అంతే కాకుండా ఘన్‌పూర్, సమీర్ పేట్‌లో 780 ఎంఎల్‌డి సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మిస్తారు. ఘణపూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement