న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హర్యానా, పంజాబ్ రాష్ట్రాల గవర్నర్లను విశాఖ శారదాపీఠాన్ని సందర్శించాల్సిందిగా ఆ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆహ్వానించారు. గురువారం చండీగఢ్ వెళ్లిన ఆయన, అక్కడ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల గవర్నర్లు బండారు దత్తాత్రేయ, బన్వరిలాల్ పురోహిత్ లను కలిశారు. ఆయా రాష్ట్రాల రాజ్‌భవన్ లను సందర్శించి విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రికను, రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందజేసారు. జనవరి 27 నుంచి 31 వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రాజశ్యామల యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని గవర్నర్లను కోరారు. విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర వద్ద గుంతిధామ్‌లో ఫిబ్రవరి 11 నుంచి 26వ వరకు భారీ ఎత్తున లక్ష చండీ యాగం తలపెడుతున్నట్లు వివరించారు.