న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ గవర్నర్ వ్యవహారాన్ని భారత రాష్ట్ర సమితి లేవనెత్తింది. గవర్నర్ తీరు సహా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు జరగనున్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వారికి మద్ధతుగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం సోమవారం మధ్యాహ్నం గం. 12.00 సమయంలో పార్లమెంటర్ లైబ్రరీ భవనంలో ప్రారంభమైంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, మురళీధరన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల పతనం, మహిళా రిజర్వేషన్ల బిల్లు, పంటలకు మద్ధతు ధరకు చట్టబద్ధత, కుల గణన సహా అనేకాంశాలను వివిధ పార్టీలు లేవనెత్తాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని ప్రస్తావిస్తూ సమాఖ్య వ్యవస్థ గురించి పార్లమెంటులో చర్చ జరగాలని బీఆర్ఎస్ కోరింది. సమావేశం అనంతరం ఆ పార్టీ నేత కేశవరావు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. గవర్నర్ వ్యవహారశైలిని తప్పుబడుతూ బడ్జెట్‌ను ఆమోదించకపోవడం అంటే ప్రభుత్వాన్ని నడవకుండా చేయడమేనని కేకే అన్నారు. శాసనసభ పాస్ చేసిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా తన దగ్గర పెట్టుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించినప్పటికీ.. దేనికైనా కాలపరిమితి ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఘర్షణ పడుతున్నారని ఆరోపించారు.
తమిళనాడులో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తగా.. కేరళలో యూనివర్సిటీల వీసీలను మార్చేస్తానంటూ అక్కడికి గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దురుద్దేశపూర్వకంగానే గవర్నర్లు రాజ్యాంగ సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. సభను ప్రొరోగ్ చేయకుండా కొనసాగిస్తున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాల్సిన అవసరం లేదని, ప్రసంగం లేనంత మాత్రాన బడ్జెట్‌ను ఆమోదించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసే విషయంపై కలిసొచ్చే పార్టీలతో చర్చిస్తామని వెల్లడించారు. సాయంత్రం వరకు భావసారూప్యత కల్గిన పార్టీలతో చర్చలు జరిపిన బీఆర్ఎస్ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి గం. 11.00 సమయంలో ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సంయుక్తంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామని తెలిపారు. అనంతరం విజయ్ చౌక్ వద్ద మీడియాతో మాట్లాడతామని ప్రకటనలో పేర్కొన్నారు.
బిల్లులే కాదు.. సమస్యలపైనా దృష్టి పెట్టండి: నామ
పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు పాస్ చేయడం మాత్రమే కాదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టి చర్చ జరపాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు అన్నారు. అఖిలపక్ష సమావేశానికి కేశవరావుతో పాటు హాజరైన నామ, భేటీలో లేవనెత్తిన అంశాల గురించి వివరించారు. పంటలకు కనీస మద్ధతు ధరను చట్టబద్ధం చేయాలని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందో చెప్పాలని ఆయనన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళ రిజర్వేషన్ బిల్లు అంశాలను కూడా తాము అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ల పతనంపై కూడా చర్చ జరగాలని అన్నారు. దీంతో పాటు రాష్ట్ర సమస్యలన్నింటినీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు.