భద్రాచలం, ప్రభన్యూస్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం జరిగిన స్వామివారి మహాపట్టాభిషేకానికి హాజరయ్యేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అనంతరం వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహా పట్టాభిషేకానికి హాజరైన ఆమె అక్కడి నుంచి స్థానిక కూనవరం రోడ్డులో వన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన గిరిజన మహిళల సీమంతం వేడుకలకు హాజరయ్యారు. గవర్నర్‌లా కాకుండా ఒక మనస్సున్న మాతృమూర్తిగా ఆమె అందరితో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. సీమంతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని, సీమంతం మాతృత్వపు బాధ్యతలను, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాలను తెలియజేస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు గిరిజనాభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అంతరించి పోతున్న గిరిజన జాతులకు సహాయం అందిస్తున్న డా.రాజశేఖర్, డా.అలీనాశాంతి తదితరులను ఆమె శాలువా కప్పి సన్మానించారు.
రెడ్‌క్రాస్ సేవలు భేష్…
గవర్నర్ తమిళిసై స్థానిక రెడ్‌క్రాస్ భవనంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన సికిల్‌సెల్ అనీమియా విభాగపు భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె రూ.20లక్షల చెక్కును అందించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ బలోపేతానికి స్థానిక విభాగం కృషి చేయాలన్నారు. ఎక్కువ మంది యువత రెడ్‌క్రాస్ సభ్యులుగా చేరేందుకు కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. భద్రాచలం రెడ్‌క్రాస్ పనితీరుపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఏజన్సీ ప్రాంతంలో రెడ్‌క్రాస్ మరింతగా తమ సేవలను విస్తృత పరచాలని ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఇదే క్రమంలో రెడ్‌క్రాస్ స్థానిక బాధ్యులు డా.ఎస్‌ఎల్ కాంతారావును పదే పదే అభినందనలతో ముంచెత్తారు. ఆయన సేవలు విశిష్టమైనవని ప్రశంసించారు. అనంతరం స్థానిక రెడ్‌క్రాస్ పెద్దలను ఉచిత రీతిగా సన్మానించడం జరిగింది. ఇదే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం ప్రసంగించి స్థానిక సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, భవానీ శంకర్, రెడ్‌క్రాస్ రాష్ట్ర నాయకులు ఈవివి శ్రీనివాసరావు, స్థానిక రెడ్‌క్రాస్ బాధ్యులు వై.సూర్యనారాయణ, వై.భాను ప్రసాద్, జి.రాజారెడ్డి, సుధాకర్‌రావు, డా.రాజశేఖర్, సిద్దులు, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..