న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మునుగోడు ఎన్నికల వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేకెత్తించింది. కేంద్ర పెద్దలకు మునుగోడు ఉప ఎన్నికలపై నివేదిక సమర్పించేందుకే ఆమె ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వినిపించాయి. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న తమిళిసై పుదుచ్చేరి లిబరేషన్ డే సందర్భంగా ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్‌లో అమర వీరులకు నివాళులర్పించారు.
త్రివిధ దళాల అధికారులు అమర సైనికుల గురించి ఆమెకు వివరించారు. అనంతరం నిర్మాణ్ భవన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయను కలిశారు. తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన పలు వైద్య, ఆరోగ్య అంశాలపై గవర్నర్ చర్చించారు. పుదుచ్చేరిలో వైద్య విశ్వవిద్యాలయం, కళాశాల ఏర్పాటునకు సహకరించాలని వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలోని బీబీ నగర్ ఎయిమ్స్ లో మౌలిక వసతుల కల్పన మీదా తమిళిసై కేంద్రమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని తమిళిసై కోరారు.