Saturday, November 23, 2024

ముగిసిన గవర్నర్ బిల్లుల పంచాయితీ.. కేసును ముగించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల పంచాయతీ ముగిసింది. తెలంగాణ శాసనసభ పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన బిల్లులను ఆమె తన వద్ద కొన్ని నెలలుగా పెండింగులో ఉంచారని, వాటిపై త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ ముగించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ ముగిస్తూ ‘సాధ్యమైనంత త్వరగా’ బిల్లులపై గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. తొలుత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ప్రస్తుతానికి గవర్నర్ వద్ద ఏ బిల్లూ పెండింగులో లేదని తెలియజేశారు. రెండు బిల్లుల విషయంలో గవర్నర్ అదనపు సమాచారంతో పాటు కొన్ని అంశాలపై వివరణ కోరారని వెల్లడించారు.

- Advertisement -

ఈ దశలో పిటిషన్‌పై తదుపరి విచారణ జరపాల్సింది ఏమీ లేనందున కేసును ముగించనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జోక్యం చేసుకుంటూ ఇక మీదట గవర్నర్ బిల్లుల విషయంలో ఇలా వ్యవహరించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభల ప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులను గవర్నర్ తిప్పి పంపారని, అందులో ప్రజారోగ్యానికి సంబంధించింది కూడా ఉందని తెలిపారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, వివరణ కోసం గవర్నర్ బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందని స్పష్టం చేశారు.

అయితే తిప్పి పంపడానికి ఇంత సమయం తీసుకోవడం సరికాదని, వెంటనే తిప్పి పంపొచ్చని దుష్యంత్ దవే అన్నారు. మధ్యప్రదేశ్‌లో వారం రోజుల్లోగా బిల్లులపై నిర్ణయం తీసుకుంటున్నారని, గుజరాత్‌లో గరిష్టంగా నెల రోజులు పడుతుందని ఉదహరించారు. తెలంగాణలో ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నందున ఇలా జరుగుతోందని ఆరోపించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఇలా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన న్యాయాధికారిగా ఉన్న తుషార్ మెహతా ఇలాగే అంటారని దవే అన్నారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. కోర్టులో గట్టిగా అరచినంత మాత్రాన ఫలితం ఉండదని తుషార్ మెహతా అన్నారు. తాను అరవడం లేదని, తానంటేనే సొలిసిటర్ జనరల్‌కు అలర్జీ అని, అందుకే ప్రతి కేసునూ వాయిదా కోరుతూ ఉంటారని దవే మండిపడ్డారు. తన 44 ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఇద్దరినీ వారించింది. చివరగా గవర్నర్లు నిర్ణీత కాలవ్యవధిలోగా బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని దవే ధర్మాసనాన్ని కోరారు.

కేసును ముగిస్తూ తీర్పు వెలువరించిన ధర్మాసనం రాజ్యాంగంలోని 200వ అధికరణంలో “సాధ్యమైనంత త్వరగా” అన్న పదానికి ఉన్న ప్రాధాన్యతను గవర్నర్లు దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చిన బిల్లులపై నిర్ణయం తీసుకునే క్రమంలో ఈ అధికరణను దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. అయితే తీర్పును డిక్టేట్ చేస్తున్న సమయంలో సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుంటూ ధర్మాసనం ఈ అంశాలను ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు సమాధనమిస్తూ.. తాము ఈ కేసులో ఈ గవర్నర్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వ్యాఖ్యలు చేయడం లేదని, అందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement