Saturday, October 5, 2024

TG | నేతన్నలకు సర్కారు శుభవార్త.. నూలు డిపో ఏర్పాటు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగ కానుకగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సుమారు 30వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుస్తూ.. వేములవాడ కేంద్రంగా యారన్‌ డిపో (నూలు డిపో)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ శనివారం జీవో విడుదల చేశారు. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నేతన్నల కోరిక నెరవేరింది. ఇక వారి కష్టాలు తీరనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు యారన్‌ డిపోను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ యారన్‌ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరింది. యారన్‌ డిపోను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 వేల మరమగ్గాలపై పనిచేస్తున్న 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుంది.

ప్రధానంగా వేములవాడ కేంద్రంగా యారన్‌ డిపోను ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలోని వేల సంఖ్యలో మరమగ్గాల కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. యారన్‌ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా వారి ఉపాధి లభిస్తుంది. కాగా, యారన్‌ డిపోను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ఈ యారన్‌ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలును టెస్కో క్రెడిట్‌ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయనుంది. యారన్‌ డిపోను ఏర్పాటు చేయడంతో సిరిసిల్ల నేతన్నలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement