Thursday, November 21, 2024

బిట్ కాయిన్ ఉంటే భారీ జరిమానా

భారత్‌లో క్రిప్టో కరెన్సీలకు ఇక కాలం చెల్లినట్లే అని భావించాలి. ఎందుకంటే వీటికి అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా మొత్తం వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొత్త చ‌ట్టాన్ని తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉంది. దీని ప్ర‌కారం డిజిట‌ల్ క‌రెన్సీని నిషేధించ‌డ‌మే కాదు.. అవి క‌లిగి ఉన్నా, వాటితో ట్రేడింగ్ చేసినా భారీ జ‌రిమానా విధించే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో మ‌న దేశంలో బిట్‌కాయిన్‌, డోజ్‌కాయిన్‌, ఇత‌ర క్రిప్టోక‌రెన్సీలు క‌లిగి ఉన్న‌వారిపై ఈ చట్టం తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. క్రిప్టోక‌రెన్సీలు క‌లిగి ఉండ‌టం, వాటి జారీ, ట్రేడింగ్‌, బ‌దిలీల‌ను నేరంగా ప‌రిగ‌ణించాల‌ని కొత్త చ‌ట్టంలో ప్ర‌తిపాదించిన‌ట్లు సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి వెల్ల‌డించారు.

ఒక‌వేళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చ‌ట్టం చేస్తే మాత్రం ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో క్రిప్టోక‌రెన్సీపై నిషేధం విధించిన తొలి దేశంగా ఇండియా నిలుస్తుంది. ఇప్ప‌టి వ‌రకూ చైనా దీని ట్రేడింగ్‌ను నిషేధించినా, ఆ క‌రెన్సీని క‌లిగి ఉండ‌టాన్ని మాత్రం నేరంగా ప‌రిగ‌ణించ‌లేదు. అయితే జ‌రిమానా విధించే ముందు ఇన్వెస్ట‌ర్లు త‌మ క్రిప్టో ఆస్తుల‌ను న‌గ‌దు రూపంలోకి మార్చుకోవ‌డానికి ఆరు నెల‌ల వ‌ర‌కూ స‌మ‌యం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ అధికారి చెప్పారు. ఇండియాలో మొత్తం 70 ల‌క్ష‌ల మంది ద‌గ్గ‌ర క్రిప్టోక‌రెన్సీ ఉన్న‌ట్లు భావిస్తున్నారు. వీళ్లు క‌నీసం 100 కోట్ల డాల‌ర్లు వీటిలో పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement