తెలంగాణలో కరోనా మహమ్మారి పలువురి ప్రాణాలను బలితీసుకుంటోంది. నెల రోజుల్లో ఏకంగా 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను పొట్టనపెట్టుకుంది. వీరిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 25 మంది ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.
అలాగే జగిత్యాల జిల్లాలో ఇద్దరు, కుమురంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు, మంచిర్యాల జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. మార్చిలో 20 మంది, ఏప్రిల్‌లో 40 మంది ఉపాధ్యాయులు కరోనాకు బలైనట్టు పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు. గత ఏడాది కాలంగా ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 20 మంది ఉపాధ్యాయులు కరోనాకు బలైనట్టు ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ తెలిపారు.