Tuesday, November 26, 2024

AP | తరగని ఇంధనం.. సౌర కిరణం ! శ్రీశైలంలో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఎన్నటికీ తరగని అసాధారణ శక్తి సౌర శక్తి… సౌర శక్తి ప్రయోజనాలు తెలిసినా సరైన అవగాహన లేక వినియోగానికి ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అద్భుతమైన సౌర శక్తిని ఉపయోగించుకునే విషయమై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. పెరుగుతున్న కాలుష్యం.. విద్యుత్‌ బిల్లులు నేప థ్యంలో ఇంధన వనరులతో కాలుష్యం లేని సోలార్‌ పవర్‌ వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

సౌరశక్తి వినియోగంతో ఆర్థికంగా మాత్రమే కాకుండా ఇతర సందర్భాల్లో సమర్ధవంతంగా పని చేస్తోంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరశక్తి పై ఎక్కువగా దృష్టి సారించాయి. ఈ రంగంలో ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు సంపాదనకు కూడా అవకాశం కల్పిస్తోంది. దీంతో సులభంగా ఎక్కడైనా సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

దీంతో విద్యుత్‌ బిల్లులు కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో విశాఖ జిల్లా ఎన్టీపీసీ సింహాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో 75 ఎకరాల్లోని నీటి వనరుల్లో 25 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం గల ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ను నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పోరేషన్‌ (ఎన్టీపీసీ) ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోనే ఇదే అతిపెద్ద ప్రాజెక్టు కావడం విశేషం. ఈ ప్రాజెక్టులో లక్షకు పైగా ఉన్న సోలార్‌ పలకల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది.

- Advertisement -

అదే విశాఖలో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్‌ పై 2.41 మెగావాట్ల ప్లాంట్‌ను జీవీఎంసీ నెలకొల్పింది. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో ప్రతి నెలా వచ్చే రూ. 40లక్షల విద్యుత్‌ బిల్లులు అంటే సంవత్సరానికి రూ.4.80 కోట్లకు పెరుగుతున్న విద్యుత్‌ బిల్లులను తగ్గిం చి, ఆ ఆదాయం ద్వారా దేవాల యాన్ని అభివృద్ధి చేయవచ్చని భావించిన పాలకవర్గం సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.

దేవస్థానంలో రూ. 40 కోట్ల వ్యయంతో 500 కేవీ సోలార్‌ ప్లాంట్‌లు రెండు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్దం చేశారు. ఇలా భారీ ప్రాజెక్టులే కాదు, సులభంగా ఎక్కడైనా సోలార్‌ ప్యానెల్స్‌న ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ సోలార్‌ ప్యానెల్‌ వినియోగదారులకు పై కప్పు సౌర ప్లాంట్ల పై 30 శాతం రాయితీని కూడా ఇస్తుంది.

సబ్సిడీ లేకుండా పై కప్పు సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చవుతోంది. సోలార్‌ ప్యానెల్‌ ధర సుమారు లక్ష రూపాయలు ఉంటుంది. సబ్సిడీ పొందితే మాత్రం ఒక కిలోవాట్‌ సామర్ధ్యం ఉన్న సోలార్‌ ప్లాంట్‌ను స్థాపించడానికి తక్కువ వ్యయం అవుతుంది. అంతే కాదు ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

సౌర ఫలకాలు ఎంత కాలం ఉంటాయంటే..

సౌర ఫలకాల జీవిత కాలం 25 సంవత్సరాలు. సౌరశక్తి నుంచి ఈ విద్యుత్తును పొందవచ్చు. దీని ప్యానెల్‌ ఇంటి పై కప్పు పై కూడా స్థాపించవచ్చు. ఈ ప్లాంట్‌ సుమారు ఒక కిలో వాట్‌ నుండి ఐదు కిలోవాట్ల సామర్ధ్యం వరకు ఉంటాయి. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కాలుష్య రహితంగా కూడా ఉంటుంది. 500 వాట్ల వరకు సోలార్‌ ప్యానెల్స్‌ అందుబాటులో ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని ప్రారంభించింది.

అవసరానికి అనుగుణంగా 500 వాట్ల వరకు సామర్ధ్యం గల సౌర విద్యుత్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయవచ్చు. దీనికి తక్కువ మొత్తంలోనే ఖర్చవుతుంది. 10 సంవత్సరాల తర్వాత బ్యాటరీని మార్చాల్సి ఉంటుంది. దీని ఖర్చు రూ.20 నుంచి 30 వేల వరకు ఉంటుంది. ఈ సౌర ఫలాకాన్ని సులభంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చుకోవచ్చు.

కరెంటును కూడా అమ్ముకోవచ్చు..

కేరళలోని కయంకుళం గ్యాస్‌ ప్లాంట్‌లో 92 మెగావాట్ల ఫ్లోటింగ్‌ యూనిట్‌ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. గురజాత్‌లోని కవాస్‌ వద్ద ఒక మెగావాట్‌ సామర్ధ్యంతో ఏర్పాటు చేశారు. అంతే కాదు రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో సౌరశక్తిని విక్రయిస్తున్నారు. దీని కింద సౌర విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్‌ను విద్యుత్‌ గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించవచ్చు.

బ్యాంకు రుణం కూడా లభిస్తోంది..

సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకునే అవకాశం ఉంది. సోలార్‌ ప్లాంట్లకు రుణాలు ఇవ్వాలని ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అన్ని బ్యాంకులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement