ప్రభ న్యూస్, హైదరాబాద్ (ప్రతినిధి) : హైదరాబాద్ నగర చారిత్రక, వారస త్వ సంపదకు ప్రతీకగా భావిస్తున్న మెట్ల బావులను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు 2021లో తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. వీటికి పున:వైభవం తీసుకువచ్చే బాధ్యతను సర్కార్ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు అప్పగించింది. స్వచ్ఛంద సంస్థలు, చరిత్ర కారుల చొరవతో 300 సంవత్సరాల క్రితం నిజాం కాలంలో నిర్మించిన 44 మెట్ల బావులను ఇప్పటి వరకు నగరంలో గుర్తించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ఆధ్వర్యంలో 2021 నుంచి పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్ కంపెనీలను సీఎస్‌ఆర్ ద్వారా భాగస్వామ్యం చేయడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి.
బావుల్లో పేరుకు పోయిన చెత్త, పిచ్చి మొక్కలను తొలగించే పనులు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నారు. ఇప్పటి వరకు బన్సీలాల్ పేట, బాపూ ఘాట్, శివబాగ్, గచ్చిబౌలి, సితారాంబాగ్, గుడిమల్కాపూర్ తదితర ప్రాంతాల్లో 18 పురాతన బావుల్లో పనులు పూర్తయ్యాయి. మిగతా బావుల పునరుద్దరణ పనులు వేగంగా జరగుతున్నాయి. మెట్ల బావులను మరింత ఆధునీకరించడంతో పాటు అవకాశం ఉన్న వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. నేటి ఆధునిక ఇంజినీరింగ్ నిపుణులు అబ్బురపడేలా ఎంతో అద్భుతంగా కట్టిన ఈ పురాత మెట్ల బావులు తిరిగి అందుబాటులోకి వస్తే భాగ్యనగర్ వైభవానికి ప్రతీకగా నిలవనున్నాయి.
భాగస్వామ్యంతో చురుగ్గా పనులు ..
నగరంలో ఇప్పటి వరకు గుర్తించిన 44 బావుల్లో 18 బావులను తిరిగి వాడకంలోకి తీసుకురాగా మిగతా బావుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్ రెస్పాన్స్ కింద పెద్ద కంపెనీలుసైతం ఇందులో పాలు పంచుకుంటున్నాయి. చారిత్రక నేపథ్యం కలిగిన శతాబ్దాల కాలం నాటి బావుల్లో నీరు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోక పోవడంతో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం పేరుకు పోయి డంపు యార్డులను తలపిస్తున్నాయి. ఆక్రమణల తొలగింపు, బావుల చుట్టూ పారిశుద్ద్య పనులను యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నారు.
పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి ..
హైదరాబాద్ నగరంలో తిరిగి వాడకంలోకి తెచ్చిన మెట్ల బావులను ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు వాడటంతో పాటు అవకాశం ఉన్న వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బావుల చుట్టూ చెట్లు నాటడం, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం, పిల్లలు సరదాగా ఆడుకునేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడం ద్వారా వీటికి మరింత శోభను తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. నగరంలోని పార్కులకు తీసిపోని విధంగా బావుల చుట్టురా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
నగరంలో గుర్తించిన మెట్ల బావులు ..
సితారం టెంపుల్ కాంపౌండ్, రాయదుర్గం, లక్ష్మన్ బాగ్, నానక్‌రాం గూడ, ఇఫ్ల్యూ క్యాంపస్ వెల్, ఫలక్ నామా బస్ డిపో, బాడి బౌలీ, కుతుభ్ షాహీ కాంప్లెక్స్, హెచ్‌సీఎస్ బౌలీ, పిరాన్ బౌలి, మహాలాక్యూ చాంద్‌బాయ్ టూంబ్, గుడిమల్కాపూర్ శేతానంబర్ టెంపుల్, నిజాం కాలేజి, రాంబాగ్ రోడ్ రామాలయం, కాశిబుగ్గ టెంపుల్ కిషన్ బాగ్, మురళీ మనోహర్ స్వామి టెంపుల్, సరూర్ నగర్ రామాలయం, హయత్ బక్షీ బేగం మెక్యూ, దెక్కన్ కాలేజీ, కార్వాన్ రాజాభగవన్ దాస్ మహాల్, కర్మాన్ ఘాట్ అంజనేయ స్వామి టెంపుల్, ఎల్బీనగర్, జహనుమా స్వేరోస్ చర్చ్, చిత్ర గుప్త టెంపుల్, శ్రీ కాళికాదేవి టెంపుల్, సాలార్ జంగ్ మ్యూజియం, మౌలాలీ మజీద్, దేవీ బాగ్, భత్‌జీ బాపూ మహరాజ్, పైగా టూంబ్స్, హుస్సేనీ అలం, దారుల్ ఉల్, టౌలీ మజీద్, జగదీష్ మందిర్, అనంతగిరి కాల హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో మెట్ల బావుల పునరుద్దరణకు గుర్తించారు.