పాలకుర్తి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతున్నాయని, సర్కారు బడులలో సకల వసతులు ఏర్పాటు అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చి, కరెంటు వచ్చి, వ్యవసాయం పెరిగిందని తద్వారా భూముల ధరలు పెరిగాయని, రైతుల గౌరవం పెరిగిందని తెలిపారు. ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చి, మరో 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి,
మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మీ కేసీఆర్ కి దక్కుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తుందని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి చేస్తుంటే నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన సీఎం కేసీఆర్ అన్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేసి నిధులు ఇచ్చి, అభివృద్ధి చేసి, ఎస్టీలను సర్పంచులు చేసి, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు 10% రిజర్వేషన్లు పెంచిన సీఎం కేసీఆర్ గారిని మనం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం 7289 కోట్ల రూపాయలతో చేపట్టిన మన ఊరు – మన బడి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా నేడు పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లా దేవరుప్పల మండలం, లక్ష్మణ్ తండాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 14 లక్షల 90 వేల రూపాయలు ఖర్చు చేసి కల్పించిన అధునాతన వసతులను మంత్రి ప్రారంభించారు.
నేను 12 ఏళ్ల కింద ఎమ్మెల్యే గెలిచిన తరవాత ఇక్కడకు వచ్చాను. అపుడు ఈ తండాలు ఎలా ఉండేవి? ఇపుడు ఎలా ఉన్నాయి? సమీక్ష చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక తండాలు ఎలా అభివృద్ది అయ్యాయి గమనించాలన్నారు. 60 ఏళ్లలో కానిది 7 ఏళ్లలో అయ్యాయి, అపుడు తండాకు వస్తె బోరింగ్ బాయి బాగు చేయమని అడిగేటోళ్లు.. నా డబ్బులన్నీ వీటికే ఖర్చు అయ్యేవి అన్నారు. తండాలకు రోడ్లు లేకపోయేవి.. ఈ ధర్మపురంలోని 5 తండాల్లో 2 కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ కింద నదీ నీళ్లను తెచ్చి, ఫిల్టర్ చేసి మంచి నీళ్ళు ఇస్తున్న మహానుభావులు సీఎం కేసీఆర్ అన్నారు. ఇవి బాటిల్ వాటర్ కంటే మంచివి. ఇవి తాగితే ఏ రోగాలు రావు. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల ఉండవు అన్నారు. గతంలో తండాకు దారి లేకుండే పరిస్ఠితి నుంచి డబుల్ రోడ్లు అయ్యే పరిస్థితికి వచ్చాం.. అపుడు లక్ష రూపాయలకు ఎకరం భూమి ఉంటే ఇపుడు 50 లక్షలకు ఎకరం భూమి అయ్యింది. రోడ్ కు ఉంటే 60 లక్షలు అయ్యింది. నీళ్లు వచ్చాక భూముల ధరలు పెరిగాయి. వ్యవసాయం పెరిగింది. రైతుల గౌరవం పెరిగింది. తెలంగాణ వచ్చకా మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా, స్టార్టర్లు కాలకుండా కరెంట్ వస్తుంది. మోటార్లకు మీటర్లు పెట్టమని బిజెపి అంటుంది. మీటర్లు పెడితే ఏటా లక్ష రూపాయలు రైతులు కట్టాలి. పక్క రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడితే బిజెపి ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణలో మీటర్లు పెడితే 30వేల కోట్ల రూపాయలు ఇస్తాం అని బిజెపి అంటోంది. కానీ సీఎం కేసీఆర్ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టను అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొన్న మహానుభావులు సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తండాలు బాగుపడ్డాయి. ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం చేశారు. సీఎం కేసీఆర్ ని మనం కాపాడుకోవాలన్నారు.