Friday, November 22, 2024

TS | వచ్చే నెల నుంచి ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ వేతనాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో సెప్టెంబర్‌ నుంచే కార్మికులకు ప్రభుత్వ వేతనాలు అందనున్నాయి. ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వ పీఆర్సీ కూడా వర్తించనుంది. ఈమేరకు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో చేసిన తరువాత కొత్తగా మరికొంత మంది ఉద్యోగులు, మరికొన్ని కొత్త బస్సులు వస్తాయని వెల్లడించారు.

అలాగే, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. వేలాది మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారనీ, దీంతో ఆర్టీసీ నష్టాల బాట నుంచి కూడా బయటపడటానికి వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ సమస్యనైనా పరిష్కరించడంలో సీఎం కేసీఆర్‌ దిట్ట అనీ, ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఆయన వెనక్కి వెళ్లరని స్పష్టం చేశారు.

- Advertisement -

అసెంబ్లిలో ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందే విషయంలో తలెత్తిన వివాదంపై ఆయన స్పందిస్తూ గవర్నర్‌ ప్రభుత్వం పంపిన బిల్లును యధావిధిగా ఆమోదిస్తే బాగుండేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీల నేతలు రాజకీయంగా విమర్శలు చేసే ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నదంటూ దుష్ప్రచారం జరుగుతున్నదనీ, దానిని నమ్మొద్దని స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్పొరేషన్‌ కొనసాగుతుందనీ, చైర్మన్‌, ఎండీ కూడా అలాగే ఉంటారనీ, కార్మికులకు వేతనాలు మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలలో నెలకొన్న వివాదాలపై ఆయన స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరవాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనీ, కార్మికులు విధులు చిత్తశుద్దితో నిర్వహించి ఆర్టీసీని నష్టాల బాట నుంచి బయట పడేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement