Tuesday, September 17, 2024

Loan Waiver | మూడో విడత రుణమాఫీకి రెడీ !!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మూడో విడత రుణమాఫీ నిధులతో సర్కార్‌ రైతులను రుణవిముక్తం చేసేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో 11,34,421 మంది రైతులుకు రూ.6,034.96 కోట్లు విడుదల చేసింది.

రెండో విడతలో లక్షన్నర లోపు రుణాలు కలిగిన 6,40,223 మంది రైతులకు రూ.6,190.01 కోట్లు విడుదల చేసింది. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షలు రుణం కలిగిన 17,75,235 మంది రైతులకు రూ.12,224.98 కోట్లు రుణమాఫీని ప్రభుత్వం చేయనుంది.

గడువులోగా పూర్తికి…

నిర్దేశిత గడువుకల్లా రుణ మాఫీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్ర సర్కారు అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈమేరకు మూడో విడత రుణ మాఫీ కోసం నిధులను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో లక్షన్నర రూపాయల వరకు అప్పు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ చేసింది. మూడో విడతలో రుణమాఫీ కోసం రూ.12,224.98 కోట్లు మేర నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

నిధుల సమీకరణతో రెడీ…

- Advertisement -

మూడో విడత రుణ మాఫీని ఆగస్టు 15న అమలు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటోంది. ఈ నెల 6న బహిరంగ మార్కెట్‌ నుంచి ప్రభుత్వం రూ.3,000 కోట్ల అప్పును సేకరించింది. తాజాగా మరో రూ.3,000 కోట్ల అప్పు కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఇండెంట్‌ పెట్టింది.

11 ఏళ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్ల ఈ రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 13న ఆర్బీఐ నిర్వహించే ఈవేలం ద్వారా ఈ అప్పును తీసుకుంటుంది. దీంతో ఆగస్టు 15నాటికి రూ.6,000 కోట్లు సమకూర్చుకోనుంది.

జులై, ఆగస్టు నెలలే కీలకం…

జులై, ఆగస్ట్‌ నెలలు రైతులకు చారిత్రకంగా నిల్చాయి. దేశంలోనే రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేసి తెలంగాణ రికార్డ్‌ సృష్టించింది. రైతులకు ఫుల్ టైం సెటిల్‌మెంట్‌ చేసి రుణమాఫీ చేసి చూపించనుంది. కాగా గత సర్కార్‌ చేసిన అప్పులకు నెలకు రూ.6 వేల కోట్లు మిత్తి చెల్లిసున్న ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.43 వేల కోట్లను గత సర్కార్‌ చేసిన అప్పులకు చెల్లింపులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement