ఖమ్మం : కుల, చేతి వృత్తులపై జీవనం సాగిస్తున్న వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ప్రకటించడం మంచి నిర్ణయమని, ఆయా వృత్తుల వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఖమ్మం నగరం దోరేపల్లి ఫంక్షన్ హాల్ నందు జరిగిన తెలంగాణ సంక్షేమ సంబురాలు, లబ్ధిదారులతో ఎర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.1లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని ఇటీవల కేబినెట్ ఆమోదించిన రోజుల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ నిర్ణయించి ఈ పథకాన్ని అమలు చేయడం వారికే సాధ్యమన్నారు. వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌లో ఆయా కులాలకు చెందిన వారు ధరకాస్తు చేసుకుని ఆయా పథకం ద్వారా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. కుల వృత్తులు, చేతివృత్తులకు సంబంధించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద వాడు, సామాన్యుడు ఆర్థిక పరిపుష్టి సాదించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని, పేదల కోసం ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుంది మన ప్రభుత్వమే అన్నారు. వారి అభివృద్ది పట్ల ముఖ్యమంత్రి కేసీఅర్ కి చిత్తశుద్ది ఉందని, అందుకే ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.
రూ.100 కోట్ల మైలురాయిని అధిగమించడం సంతోషంగా ఉంది.. మంత్రి పువ్వాడ..
ఖమ్మం కార్పోరేషన్-92 రఘునాథపాలెం-20 మొత్తం-112 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి/షాది ముభారక్ చెక్కులకు గాను రూ.1.12 కోట్లు విలువైన చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. మంత్రి పువ్వాడ సిఫారసు మేరకు మజురైన 212-ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులకు గాను రూ.79.82 లక్షల విలువైన చెక్కులను మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణీ చేశారు. నేటి వరకు ఖమ్మం నియోజకవర్గం పరిధిలో కళ్యాణ లక్ష్మి/షాది ముభారక్ పథకం, సీఎంఆర్ ఎఫ్ చెక్కులను గాను నేడు రూ.100.90 కోట్ల మైలురాయిని అదిగమించామని మంత్రి పువ్వాడ సగర్వంగా ప్రకటించారు.
పేదలకు జీఓ నెంబర్ 58, 59 పట్టాలు పంపిణీ.. :
ప్రభుత్వ జాగాలో నివాసం ఏర్పరచుకున్న ప్రతి పేదవారికి జీవో నెంబర్ 58&59 పథకం ద్వారా మంజూరు చేసిన ఇళ్ళ పట్టాలను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో పంపిణీ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అర్హుల్కెన లబ్ధిదారులు నేటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరల దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పట్టాలు ఇస్తామన్నారు. రఘునాథపాలెం మండలంలో 2 పట్టాలు, ఖమ్మం కార్పొరేషన్ లోని 31, 30, 32, 34, 28, 46, 47 & 48వ డివిజన్ లకు చెందిన మొత్తం 148 పట్టాలను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓనెం.58, 59 పథకం క్రింద ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికి పూర్తి హక్కు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం లోనే మొదటిగా జి.ఓనెం. 58, 59 పథకం క్రింద పెద్ద ఎత్తున పట్టాలు సిద్దం చేసి మునుపెన్నడూ లేని విధంగా ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అర్హుల్కెన ప్రతి పేదవాడికి పట్టాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోనే నిర్మించిన 2వేల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందజే శామని అన్నారు. ఇళ్లు రాని వారికి సొంత స్థలం కలిగిన వారికి రూ.3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరుపున అందిస్తామని అన్నారు. పేదల పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తుశుద్దితో వ్యవహరిస్తున్నదని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ జి.ఓ నెం.58, 59 పథకం క్రింద ఎలాంటి ఆదెరువు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం వారి ఇంటిపై వారికి పూర్తి హక్కు కల్పించాలనే సంకల్పంతో ఖమ్మం నగరంలో ఇప్పటికే 2 వేల 500 మంది పేదలకు పైగా పెద్ద ఎత్తున పట్టాలను అందించడం జరిగిందన్నారు.
ఆసరా పెన్షన్స్ గుర్తింపు కార్డ్స్ పంపిణి.. :
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నరాని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో మంజూరైన ఆసరా పెన్షన్ కార్డ్స్ & గుర్తింపు కార్డ్స్ ను మంత్రి పంపిణీ చేశారు. గత పాలకుల పాలనలో వృద్ధులకు పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని, కానీ నేడు కేసీఆర్ సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారని ఆయన తెలిపారు.
అభివృద్ధిలో తెలంగాణను మేటిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి పెన్షన్ ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గొల్ల, కురుమలకు ఆర్థిక పరిపుష్టి.. :
దేశంలో ధనికులైన గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణలో ఉన్నారని చెప్పుకునే పరిస్థితి నేడు తెలంగాణలో ఉన్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గొల్ల కురుమలు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని, నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా గొరెల పథకాన్ని ప్రారంభం అయిందన్నారు. రెండో విడతలో రూ.6,085 కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నదని, గొర్రెల పంపిణీలో అర్హులకు 100 శాతం లబ్ధి జరిగేలా పారదర్శకతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గొర్రెల కొనుగోలు ప్రాంతానికి అధికారులతో పాటు లబ్ధిదారులను కూడా తీసుకెళ్లి నచ్చిన గొర్రెలను ఎంచుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం నెరవేరిందని, ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో సుమారు రూ.8 వేల కోట్ల సంపద సృష్టి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి పి గౌతం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, జిల్లా టిఆర్ఎస్ నాయకులు ఆర్ జె సి కృష్ణ, మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.