Tuesday, November 26, 2024

Education | ఇంజనీరింగ్‌ సీట్ల పెంపుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు పెరిగినయ్‌. సీట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణలో మరో 14,565 ఇంజనీరింగ్‌ సీట్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్‌ గ్రూపుల్లోని సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజనీరింగ్‌ కాలేజీలు.. కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజనీరింగ్‌ సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదనపు సీట్ల పెంపు ఫలితంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.27.39 కోట్ల భారం పడనుంది.

ఇటీవల 86,106 ఇంజనీరింగ్‌ సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనుమతినిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది. ప్రభుత్వం అనుమతినిచ్చిన 14,565 సీట్లలో 70 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు ఉండగా, 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు ఉన్నాయి. 14,565 సీట్లలో 10,196 సీట్లు కన్వీనర్‌ కోటా కింద ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇక మిగిలిన సీట్లు మేనేజ్‌మెంట్‌ల చేతిలో ఉంటాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లాంటి పెద్దగా డిమాండ్‌లేని కోర్సులకు సంబంధించిన సీట్లను క్యాన్సిల్‌ చేసుకొని కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను కళాశాల యాజమాన్యాలు తెచ్చుకున్నాయి. సాంప్రదాయ కోర్సుల్లో విద్యార్థులు చేరకపోవడంతోనే కంప్యూటర్‌ కోర్సులకు అనుమతి తెచ్చుకున్నాయి. దాదాపు ఏడు వేల సీట్లు అవే ఉన్నాయి.

- Advertisement -

కౌన్సెలింగ్‌ షెడ్యూల్లో మార్పు….

రాష్ట్రంలో మరో 14,565 ఇంజనీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో పాటు ఒకట్రెండు రోజుల్లో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. అర్హత కలిగిన విద్యార్థులందరూ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ రకమైన స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఈనెల 7 నుంచి ప్రారంభం కానుంది. 7 నుంచి 8వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.

9న స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. 12 తేవీ వరకు కోర్సులు, కాలేజీల ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. జూలై 16న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 16 నుంచి 22 వరకు సీటు పొందిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్‌ జూలై 24 నుంచి ప్రారంభకానుంది. 31న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 4 నుంచి ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఆగస్టు 9న తుది విడత సీట్లను కేటాయిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement