హైదరాబాద్, ఆంధ్రప్రభ : తల్లి, బిడ్డ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 56 టిఫా యంత్రాలను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. వీటితోపాటు 26 ఆప్తల్మిక్ ఎక్విప్‌మెంట్లను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇక గర్భిణులు టెస్టుల కోసం బయటికి వెళ్లే అవసరం ఉండబోదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై నెలవారీ సమీక్షను సోమవారం నిర్వహించారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న టిఫా యంత్రాలతో గర్భిణులు టెస్టుల కోసం ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, టీ డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా థైరాయిడ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సమీక్ష సందర్భంగా సివిల్, ఎక్విప్‌మెంట్, ఈ-ఉపకరణ్, డ్రగ్స్, సర్జికల్, డయాగ్నస్టిక్స్, స్పెషల్ ప్రాజెక్టులు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. గాంధీ, నిమ్స్, జహీీరాబాద్, హుస్నాబాద్, మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. టీవీవీపీ పరిధిలోని 32 ఆసుపత్రుల అప్‌గ్రెడేషన్ పనులు, 13 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయాగ్నస్టిక్ పనులు వేగవంతం చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 41 బస్తీ దవాఖానాలు 31 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు.
జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాల పనులు వేగవంతం చేయాలన్నారు. డీఎంహెచ్‌ఓలు బాద్యత తీసుకోవాలని సూచించారు. సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. జీవన్‌దాన్ ద్వారా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు, బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సలు చేయాలి…
క్యాన్సర్ వ్యాధిని చికిత్స ద్వారా నయం చేయొచ్చని, ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రోగులకు ఆరోగ్య శ్రీ పథకం కింద ఈ వైద్యం అందించాలని కార్పోరేటు ఆసుపత్రులకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. చెల్లింపుల గురించి ఆందోళన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తుందన్నారు. మెరుగైన వైద్యం అందించడం కార్పోరేట్ , ప్రభుత్వ ఆసుపత్రులకు సవాల్‌గా మారిందన్నారు. ఈ మేరకు సోమవారం మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ట్రూ బీమ్ రేడియేషన్ మిసన్‌ను ప్రారంభించి మాట్లాడారు. పేదలకు వైద్యం అందించాలని, పేదవారి కోసం ఆలోచించాలని యాజమాన్యాలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం కోసం 1140 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట ఆసుపత్రుల్లో త్వరలో క్యాథ్‌ల్యాబ్స్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.