హైదరాబాద్, ఆంధ్రప్రభ : అన్ని రకాల క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్ మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌ను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ పోటీలకు 26 రాష్ట్రాల నుంచి 800 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారులకు చేయూతనిస్తుందని చెప్పారు. క్రీడలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో క్రీడా పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయన్నారు. హైదరాబాద్ వేదికగా పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని, ఇలాంటి పోటీలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ప్రపంచ దేశాలు క్రీడలను ప్రోత్సహిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం క్రీడలను నిర్లక్ష్యం చేస్తుందని ఆయన విమర్శించారు. క్రీడలు అంటే క్రికెట్ మాత్రమే కాదనే విషయాన్ని కేంద్రం గుర్తించుకోవాలన్నారు. క్రికెట్‌పై వచ్చే ఆదాయంతో ఇతర క్రీడల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.