రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున ఒకే అభ్యర్థిని నిలపాలన్న ప్రయత్నాలు కలసి రావడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా పోటీ చేయబోనని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ సోమవారంనాడు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సూచించిన ముగ్గురు నేతలూ పోటీలో లేమని చెప్పడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో ఇటీవల జరిగిన విపక్షాల సమావేశలో రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పేరును ప్రతిపాదించగా అనారోగ్యం కారణంగా బరిలో నిలవబోనని ఆయన సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా తమ తరపున నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మమత ప్రకటించగా ఆదివారంనాడు అబ్దుల్లా చేతులెత్తేశారు.
కాగా ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీ కూడా అదేమాట చెప్పారు. అయితే విపక్షాలు తన పేరును ఎంపిక చేయడం గొప్ప విషయమని, అయితే తనకన్నా మెరుగైన, జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం పొందగలిగే సమర్థులున్నారని అభిప్రాయపడ్డారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అధికార బీజేపీ ఇంకా ఎవరి పేరునూ ప్రకటించలేదు. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాలు ఇంతవరకూ సఫలం కాలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.