పార్వతీపురం, జూన్ 30: గ్రామాలలో భవనాల నిర్మాణపనులు వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. పంచాయతీ రాజ్ కమీషనర్ కోన శశిధర్ తో కలిసి సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్. ఆర్. హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ భవనాలు నిర్మాణం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, జల జీవన్ మిషన్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, వై.ఎస్.ఆర్ జలకళ, పన్నులు వసూలు తదితర అంశాలపై ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భవనాలు నిర్మాణానికి అవసరమైన సిమెంట్, నిధులు అందుబాటులో ఉన్నందున లక్ష్యం మేరకు పనులు చేసి, భవన నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ మందికి పనులు కల్పించాలని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ప్రగతి నివేదికలు పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. జల జీవన్ మిషన్ పనులు మరింత వేగవంతం చేయాలని కోరారు. పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప గ్రామాలు ఆవిర్భావం జరగాలని, వై. ఎస్. ఆర్. జలకళ పధకానికి గ్రామ సర్వేయిర్ నివేదికలు సకాలంలో అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొని జిల్లాలో జరుగుతున్న పనులు ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, ఆర్. డబ్ల్యు.ఎస్, పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.