భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తమ మాతృదేశంపై మమకారం చాటుకున్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో తన వంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దేశంలో తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇండియాలో తీవ్రమవుతున్న కరోనా సంక్షోభాన్ని చూసి తల్లడిల్లుతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు గూగుల్ సంస్థ, ఉద్యోగుల విరాళాలను కలిసి రూ.135 కోట్లను అందిస్తామని ప్రకటించారు. అలాగే వైద్య సామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇస్తామన్నారు. క్లిష్టమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి సహాయపడే నిధులను అందిస్తున్నామని సుందర్ పిచాయ్ వెల్లడించారు.