Thursday, November 21, 2024

భారత కొత్త ఐటీ చట్టాలపై స్పందించిన గూగుల్ సీఈవో

భారత ప్రభుత్వం ఫిబ్రవరిలో కొత్తగా తెచ్చిన ఐటీ నియమ నిబంధనలు నిన్నటి నుండి అమలు అవుతుండగా.. వాటిపై దిగ్గజ సంస్థ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఏ దేశమైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం కోరిన విధంగా మార్పులను కూడా తమ నివేదికల్లో పొందుపరుస్తామని అన్నారు.

ఆసియా పసిపిక్ రిపోర్టర్లతో జరిగిన వర్చువల్ సమావేశంలో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ ‘‘స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌.. భారత్‌లో సుదీర్ఘంగా ఉన్న సంప్రదాయం. ఒక కంపెనీగా.. ఆ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ విలువలు, వాటి ప్రయోజనాల గురించి మాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా మేం కలిసి పనిచేస్తాం. సంపూర్ణ సహకారం అందిస్తాం. న్యాయపరమైన ప్రక్రియలు, విధానాలపై మాకు గౌరవం ఉంది. అందువల్ల ప్రభుత్వాలు అవలంబించే రెగ్యులేటరీ విధానాలకు మేం పూర్తిగా కట్టుబడి ఉంటాం. అది యూరప్‌లోని కాపీరైట్‌ ఆదేశాలైనా.. భారత్‌లోని డిజిటల్ కంటెట్‌ నియంత్రణ చర్యలైనా.. వాటిని మేం ఒకేలా చూస్తాం. వాటిని ఎలా పాటించాలన్న దాని గురించి పరిశీలిస్తాం’’ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement