Tuesday, November 19, 2024

Good News – కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికీ గృహ‌జ్యోతి వ‌ర్తింపు – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

విద్యుత్ ఉత్పత్తికి అన్ని జాగ్రత్తలు తీసుకోండి
జెన్ కోలో టెక్నికల్ కమిటీ వేయండి
విద్యుత్ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్న‌తాధికారుల‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులతో ఉప ముఖ్య‌మంత్రి స‌మీక్ష జ‌రిపారు.

ఈ సంద‌ర్భంగా జెన్ కో నిర్వ‌హించే విద్యుత్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్ప‌డే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. విద్యుత్ ఉత్ప‌త్తి రంగ సంస్థ‌ల్లో ఏర్ప‌డే సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఈ క‌మిటీ క్షేత్ర‌స్థాయికి వెళ్లి అధ్య‌య‌నం చేసి పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా జెన్ కో సీఎండీ నిర్ణయం తీసుకుని విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం రాకుండా చూడాల్సిందిగా ఆదేశించారు.

- Advertisement -

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ -1లో జనరేటర్ ట్రాన్స్ ఫార్మార్ మరమ్మతులు చేయాలా? …లేక కొత్త‌ది కోనుగోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమిటీకి పరిశీలిస్తోంద‌ని అన్నారు. డిసెంబ‌ర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు  సంబంధించి  తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదించాలని ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయాలను అమలు చేసే సమయంలో సీఎండీలు తప్పనిసరిగా ఎనర్జీ సెక్రెటరీని సంప్రదించాలని సూచించారు.‌

జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఇందులో ఎలాంటి ఆలసత్వం వహించవద్దని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం గురించి ఆరా తీశారు. గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి గృహ జ్యోతి పథకాన్ని వారికి వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ మొదలైందని చెప్పారు, అందులో 113 సబ్ స్టేషన్లకు స్థల సమస్య లేదని మిగతా వాటికి స్థలాలు కలెక్టర్లు కేటాయించాల్సి ఉందని చెప్పారు.

కాలేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉప‌యోగిస్తున్నారు? అందుకు ఎంత మేర ఖ‌ర్చు అవుతోందో మొత్తం వివ‌రాల‌తో నివేదిక ఇవ్వాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టంగా చెప్పారు.
ఈ సమస్య సమావేశంలో ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement