సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరలకు గోధుమ పిండి, బియ్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించింది. దీనికి సంబంధించిన రెండో దశను నేడు (మంగళవారం) ప్రారంభించింది. ఈ మేరకు.. ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు తాత్కాలికంగా ఈ విక్రయాలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ కంపెనీల ద్వారా ఈ విక్రయాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నులు బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి సేకరించామని… కేటాయించిన స్టాక్ పూర్తయ్యే వరకు విక్రయాలు కొనసాగుతాయన్నారు.
అవసరమైతే అదనపు కేటాయింపులు జరుపుతామని మంత్రి తెలిపారు. గోధుమ పిండిని కిలో రూ.30కే విక్రయిస్తామని.. ఇవి 5, 10 కేజీల ప్యాకెట్స్‌లో లభిస్తాయని చెప్పారు. ఇక కిలో బియ్యం రూ.34 చొప్పున విక్రయించనున్నారు. 5, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో బియ్యం లభించనున్నాయి.