Sunday, September 22, 2024

Odisha | మహిళా ఉద్యోగులకు శుభవార్త

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మ‌హిళా ఉద్యోగుల‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కటక్‌లో జరిగిన ఇండిపెండెన్స్ వేడుకల్లో ఒడిశా డిప్యూటీ సీఎం పార్వతీ పరీదా దీనిపై ప్రకటన చేశారు.

ఒడిశాలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగినులతో పాటుగా ప్రైవేటులో పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా ఈ నెలసరి సెలవు వర్తిస్తుందని పార్వతీ పరీదా వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మహిళలు తమ నెలసరి సమయంలో మొదటి లేదా రెండో రోజు.. ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది.

మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి పార్వతీ పరీదా తెలిపారు. మరోవైపు ప్రస్తుతం బిహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. 1992లోనే బిహార్ ఈ నెలసరి సెలవుల విధానాన్ని తీసుకువచ్చింది. అక్కడ ప్రస్తుతం ప్రతి నెలా రెండు రోజులు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నారు. ఇక గతేడాది కేరళ ప్రభుత్వం విద్యార్థినులను నెలసరి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement