మెటా మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో ఒకటి. మెటా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లు, అప్డేట్లను అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ లో యూజర్లకు కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి యాప్‌లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి.
‘కాల్స్’ ట్యాబ్‌లో కొన్ని మార్పులు చేస్తోంది మెటా. ప్రస్తుతం కాల్స్ ట్యాబ్‌కు వెళ్లినప్పుడు పైన కాల్ లింక్ ఎంపికను చూస్తారు యేజర్లు. అయితే త్వరలో కంపెనీ దాన్ని ‘న్యూ కాల్’ ఆప్షన్‌తో భర్తీ చేయబోతోంది. ఇది కాకుండా త్వరలో 31 మందిని ఒక కాల్‌కు యాడ్ చేయగలిగు ఫీచర్ ను కూడా యాడ్ చేయనుంది. అంటే కాల్ ప్రారంభించిన తరువాత ఒకేసారి 31 మందిని కాల్‌కు యాడ్ చేసే ఆప్షన్ లభించనుంది. ప్రస్తుతం 15 మందిని మాత్రమే యాడ్ చేయగలిగు యాక్సెస్ ఉంది. ఈ అప్డేట్ వాట్సాప్ బీటా 2.23.19.16లో కనిపించింది.
ఆడియో కాల్స్ మాత్రమే కాకుండా.. వీడియో కాల్స్ లోనూ అప్డేట్ తీసుకురానుంది వాట్సాప్. ప్రస్తుతం వీడియో కాలింగ్ లో అవతార్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్ తో యూజర్లు ఎవరికైనా వీడియో కాల్ చేసినప్పుడు, వారి ముఖానికి బదులుగా యూజర్ అవతార్‌ను చూస్తారు. ఈ అవతార్లు యూజర్ల ముఖ కవళికలు, ఎక్స్ ప్రెషన్స్ ని కూడా అనుకరిస్తాయి. ఈ ఫీచర్ వీడియో కాలింగ్ అనుభవాన్ని మారుస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్ల వద్ద అందుబాటులో ఉంది. వీటిని సాధారణ యూజర్లు త్వరలో పొందుతారు.
ఇక పోతే, వాట్సాప్ ఇటీవల భారతదేశంలో ఛానెల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సహాయంతో మీకు ఇష్టమైన కంటెంట్ క్రియేటర్ లేదా సెలబ్రిటీతో కనెక్ట్ అవ్వవచ్చు. రాబోయే కాలంలో కంపెనీ ప్రతి ఒక్కరికీ వారి సొంత ఛానెల్‌ని సృష్టించే అవకాశాన్ని కూడా ఇస్తుంది. వాట్సాప్ ఛానెల్ ఫీచర్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానెల్ లాంటిది. దీనిలో మీరు మీ కంటెంట్ క్రియేటర్లకు సంబంధించిన అప్డేట్స్ను తెలుసుకోవచ్చు.