హైదరాబాద్, ఆంధ్రప్రభ: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గ్రూప్2, 3, 4 పోస్టులు పెరగనున్నాయి. ఈ గ్రూప్స్ పరిధిలోకి కొత్తగా చేరిన పోస్టులను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 55ను సవరిస్తూ జీవో నెంబర్ 136ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను గ్రూప్, 3, 4 పరిధిలోకి తీసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా సర్వీసుల్లో ఉన్న అర్హతలు ఒకే విధంగా ఉండటంతో ఈ మార్పులు చేసింది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పాలి.
టీఎస్పీఎస్సీ ప్రతిపాదించిన మేరకు ప్రభుత్వం ఈ పోస్టులను సవరించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించిన ఖాళీల ప్రకారం గ్రూప్-2 పోస్టులు 582, గ్రూప్-3 పోస్టులు 1373, గ్రూప్-4 ఖాళీలు 9,168 వరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా విభాగాల్లో పోస్టుల సంఖ్య పెరగనుంది. టీఎస్పీఎస్సీ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో నోటిఫికేషన్లను జారీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. కొత్తగా పోస్టులు చేరడంతో త్వరలో జారీచేసే ఉద్యోగ నియామక ప్రకటనల్లో ఖాళీలు పెరగనున్నాయి.
గ్రూప్-2లో చేర్చిన కొత్త పోస్టులు…
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. గ్రూప్-2 ఆరు పోస్టులను కొత్తగా చేర్చారు.
గ్రూప్-3లోని కొత్త పోస్టులు…
ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ విభాగంలోని అకౌంటెంట్ పోస్టు, వివిధ విభాగాల్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ పోస్టులున్నాయి.
గ్రూప్-4లోని కొత్త పోస్టులు…
జిల్లా విభాగాల పరిధిలోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, సూపర్వైజర్(మేల్), మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్, మ్యాట్రన్ పోస్టులను కొత్తగా గ్రూప్-4లో చేర్చారు.