ఆంధ్రప్రభ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఖుషీ ఖబర్ అందించింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం తెలిపింది. 9168 పోస్టుల భర్తీకి శుక్రవారం అనుమతులు మంజూరీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపినట్లుగా మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. నిర్దేవిత ప్రకటించిన 9168 గ్రూప్-4 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ హామీకి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆశావహులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం 80039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 52వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులను దశలవారీగా జారీ చేసింది. 18వేల కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలతోపాటు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తయింది. మిగతా పోస్టుల భర్తీకి వీలుగా అన్ని సంబంధిత విభాగాలు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాయి.
అయితే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల ప్రకటనతో భర్తీ ప్రక్రియకు కొంత ఆటంకం ఎదురైంది. ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనల్లో జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్ల ఫలాలను ప్రభుత్వం అందించేందుకు 6నుంచి 10శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. 10శాతం రిజర్వేషన్లతో 100 రోస్టర్ పాయింట్లలో 10పాయింట్లను రిజర్వ్ చేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిపాదనలకు సవరణలు పూర్తయ్యాయి. ఒక్కో జిల్లాలో 74 విభాగాలలో కసరత్తు పూర్తికి చేరడంతో ఇక వరుసగా నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలలో 9వేల ఉద్యోగాలకు, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులపై ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. త్వరలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
వివరాలు ఇలా…
జూనియర్ అసిస్టెంట్ 429
జూనియర్ అసిస్టెంట్ 6859
జూనియర్ ఆడిటర్ 18
వార్డ్ ఆఫీసర్ 1862
మొత్తం 9168