కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ కార్యక్రమంలో మరో మైలురాయిని చేరబోతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో సేవలందిస్తున్న వందేభారత్ దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా ప్రత్యేక గుర్తింపును పొందింది. కాగా, దేశంలో త్వరలో మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని భారతీయ రైల్వే తెలిపింది. వందేభారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రూట్లలో నడుస్తున్నాయి. అంతే కాకుండా మరో 9 రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.
త్వరలో పట్టాలెక్కనున్న ఈ కొత్త రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు సమాచారం. ట్రాక్‌పైకి వచ్చే కొత్త రైళ్లలో ఎక్కువ భాగం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు వెళ్తాయి. ఇందుకోసం రైల్వే మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల్లోనూ భారీ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ పలు రైళ్లు ఒకేసారి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.