అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కౌలు రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్బీకేల ద్వారా 7.77 లక్షల మందికి ఈఏడాది కౌలు కార్డులు జారీ చేశారు. వీరి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయగా.. సెప్టెంబర్‌లో వీరికి రైతు భరోసా తొలి విడత సాయం అందించనున్నారు. అంతేకాదు ఈ ఏడాది కౌలు రైతులకు రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈఏడాది కౌలు కార్డులు (సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. 2019లో ప్రభుత్వం తీసుకొచ్చిన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019-20 సీజన్‌లో 2లక్షల 72వేల 720 మందికి.. అలాగే 2020-21లో 4,14,770 మందికి, 2021-22 సీజన్‌లో 5,24,203 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేశారు.
2022-23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. అంతేకాదు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలు రైతులకు రూ.246.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. ఈసారి ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశారు.
వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉన్నారు. సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించనున్నారు. వచ్చే నెలలోనే రైతు భరోసా నిధుల్ని అందజేయనుండటంతో కౌలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.4వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టు-కోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.