తెలంగాణలో మత్స్యకారులకు శుభవార్త అందింది. ఈ మేరకు ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు.
గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని చెప్పారు. గుక్కెడు మంచి నీళ్లకోసం గోసపడ్డ ప్రాంతం ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతోందని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.