విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించి తరగతుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం జాతీయ విద్యా విధానంలో పొందుపరిచిన సిఫార్సులను అమలు చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే బ్యాగు అవసరం లేని రోజులను (బ్యాగ్ లెస్ డేస్) అమలు చేసేందుకు సిద్ధమైంది. ఏడాదిలో మొత్తం 10 రోజులు ఈ సదుపాయం కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 10 రోజుల పాటు పుస్తక రహిత వాతావరణం కల్పించాలని జాతీయ విద్యా విధానం సిఫార్సు చేస్తోంది. దీన్ని అమలు చేసేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కి చెందిన పీఎస్‌ఎస్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ తాజా మార్గదర్శకాలను రూపొందించింది.