హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకుని… సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల వైద్య విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం రానీయకుండా కృషి చేస్తున్నామని నియో సంస్థ ఛైర్మన్ డా.అవులప్ప, సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్‌బాబు, నియో డైరెక్టర్ దివ్య సునీతరాజ్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ నుంచి ఇరు తెలుగు రాష్ట్రాలకు క్షేమంగా తిరిగి వచ్చిన విద్యార్థులతో నియో సంస్థ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఉక్రెయిన్ యూనివర్సిటీలు ఆన్‌లైన్ విద్యా విధానాన్ని ఆమోదించినందున విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఛైర్మన్ ఆవులప్ప, డైరెక్టర్ దివ్య తెలిపారు. అవసరమైతే ప్రాక్టికల్స్ ను ఇక్కడి ఆసుపత్రుల్లోనే చేయిస్తామన్నారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు సూపర్ స్పెషలిస్టు వైద్యులుగా ఎదుగుతారని, ఆందోళన అవసరం లేదన్నారు. ఉక్రెయిన్‌కు నియో సంస్థ నుంచి దాదాపు 2వేల మంది విద్యార్థులు వైద్య విద్య కోసం వెళ్లగా వారందరినీ ఎంతో శ్రమించి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చామన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి విద్యార్థులను ఢిల్లీకి చేరవేయడంలో కేంద్ర ప్రభుత్వం చాలా చురుకుగా వ్యవహరించిందని, అలాగే, అక్కడి నుంచి విద్యార్థులను వారి స్వస్థలాలకు క్షేమంగా తరలించడంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
ఇందుకు సహకరించిన వివిధ పార్టీల నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీ యాజమాన్యాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యుద్దం కారణంగా అక్కడి యూనివర్సిటీలు ప్రస్తుతం రెండువారాల సెలవులు ప్రకటించాయని, ఆ తర్వాత విద్యార్థుల కేరీర్‌కు నష్టం జరగకుండా చూస్తామన్నారు. నియో సంస్థకు 46 దేశాల యూనివర్సిటీలతో ఒప్పందాలు ఉన్నాయని, అవసరమైతే వారిని అక్కడ సర్దుబాటు చేస్తామన్నారు. ఒకవేళ, యుద్ధం దీర్ఘ కాలం కొనసాగితే, యూనివర్సిటీని ఐరోపాలోని ఇతర దేశాలకు మార్చే అవకాశం ఉందని తెలిపారు. కాగా.. ఇతర సంస్థలకు భిన్నంగా, క్లిష్ట పరిస్థితుల్లో నియో సంస్థ విద్యార్థుల వెన్నంటి ఉండి, వారిని కంటికి రెప్పలా కాపాడుతోందని సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయబాబు అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రయత్నిస్తోందన్నారు. ఈ సమావేశంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..