హైదరాబాద్, ఆంధ్రప్రభ : జొన్న కొనుగోలు పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెంచిన ఈ పరిమితి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని రైతులకు మాత్రమే ఈ దఫా వర్తించనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జొన్న పండించిన రైతుల విజ్ఞప్తి మేరకు సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు జిల్లాల్లో ఎకరాకు ఇంతకు ముందు ఉన్న 8.85 క్వింటాళ్ల పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచింది.
ఈ మేరకు కొనుగోలు ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జొన్న రైతులు తక్కువ ధరకు ప్రయివేటు వ్యాపారులకు పంటను అమ్ముకోవద్దని, పెంచిన దిగుబడి పరిమితి/కొనుగోలు పరిమితి ప్రకారం జొన్న రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రైతులకు సర్కారు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్‌కు రూ.3180 చెల్లించి జొన్న పంటను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తోంది.
అయితే గత అయిదు సంవత్సరాల దిగుబడి ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించింది. అయితే ఈ యాసంగిలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో జొన్న దిగుబడులు గణనీయంగా పెరగడంతో రైతుల విజ్ఞప్తి మేరకు జొన్న కొనుగోలు పరిమితిని పెంచుతూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్ణయం తీసుకున్నారు.