Friday, November 22, 2024

AP | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సొంత రీజియన్లకు బ‌దిలీకానున్న‌ 173 మంది

అమరావతి, ఆంధ్రప్రభ: : ఆర్టీసీలో కేడర్‌ స్ట్రెంత్‌ పేరిట వేర్వేరు రీజియన్లకు బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఉన్నతాధికారులు తీపి కబురు చెప్పారు. పాలనాపరమైన సర్థుబాటులో భాగంగా వేర్వేరు రీజియన్లకు వెళ్లిన కండక్టర్లు, డ్రైవర్లను సొంత రీజియన్లకు పంపనున్నారు. ఇప్పటికే వివిధ రీజియన్లలో విధులు నిర్వహిస్తున్న వీరి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పుడున్న రీజియన్‌లో పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు ఇష్టపూర్వకంగా ఉంటే నిర్థిష్ట కాలం వరకు ఉంచనున్నారు.

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కేడర్‌ స్ట్రెంత్‌ సమస్య తలెత్తింది. వివిధ డిపోల్లో కేడర్‌ స్ట్రెంత్‌ పేరిట ఉద్యోగులను సర్థుబాటు చేయాల్సి వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు వర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే తలెత్తిన కేడర్‌ స్ట్రెంత్‌ను దృష్టిలో ఉంచుకొని అధికారులు సొంత రీజియన్ల నుంచి వేర్వేరు రీజియన్లకు డ్రైవర్లు, కండక్టర్లను పంపారు. కేడర్‌ స్ట్రెంత్‌ పేరిట వేర్వేరు రీజియన్లకు మార్చడంపై ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తించింది.

దూర ప్రాంతాలకు వీరిని బదిలీ చేయడంతో వెళ్లేందుకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశాలపై పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ సంఘాల నేతల అభ్యర్థన మేరకు సమస్యను పరిష్కరించేందుకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో వీరిని సొంత రీజియన్లకు పంపేందుకు మార్గం సుగగమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల నేపధ్యంలో అధికారులు సొంత రీజియన్లకు పంపే ప్రక్రియను మొదలు పెట్టారు.

- Advertisement -

81 మంది కండక్టర్లు..

సొంత రీజియన్లకు పంపనున్న కండక్టర్లలో 81 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వివిధ యూనిట్లలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. వీరిని సొంత రీజియన్‌ అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పంపనున్నారు.

ఉమ్మడి చిత్తూరు రీజియన్‌కు చెందిన 41 మగ కండక్టర్లను సీనియారిటీ ప్రాతిపదికన కేడర్‌ స్ట్రెంత్‌లో భాగంగా నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు రీజియన్లకు బదిలీ చేశారు. ఉమ్మడి కడప జిల్లా రీజియన్‌కు చెందిన ఎనిమిది మంది మహిళా కండక్టర్లు కర్నూలు రీజియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిని సొంత రీజియన్‌కు పంపనున్నారు. కడప రీజియన్‌ నుంచి సీనియారిటీ ప్రాతిపదికన అనంతపురం, కర్నూలు రీజియన్లలో విధులు నిర్వహిస్తున్నారు.

డ్రైవర్లు 92 మంది..

కేడర్‌ స్ట్రెంత్‌లో భాగంగా సొంత రీజియన్ల నుంచి వేర్వేరు రీజియన్లకు బదిలీ చేసిన 92మంది డ్రైవర్ల జాబితాను సిద్ధం చేశారు. ఉమ్మడి ప్రకాశం రీజియన్‌కు చెందిన 14 మంది డ్రైవర్లు నెల్లూరు రీజియన్‌లోని వివిధ యూనిట్లలో విధులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్టణం రీజియన్‌కు చెందిన 55 మంది డ్రైవర్లు పాలనాపరమైన విధుల్లో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

మరో 23 మంది డ్రైవర్లు ఎన్‌ఈసీ(ఉత్తరాంధ్ర) రీజియన్‌కు బదిలీపై వెళ్లారు. వీరిని సొంత రీజియన్‌ అయిన విశాఖపట్టణం రీజియన్‌కు బదిలీ చేయనున్నట్లు అధికారులు చెపుతున్నారు. సొంత రీజియన్‌ కాకుండా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న రీజియన్‌లోనే పని చేసేందుకు అంగీకరించిన పక్షంలో 2024 డిసెంబర్‌ 31 వరకు తాత్కాలికంగా అవకాశం ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement